
ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో.. మొక్కలకి, జంతువులకి అంతే ఉందని అన్నారు ప్రిన్స్ మహేష్ బాబు . ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఫిలింనగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.
అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ.. నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా. అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనాలాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం. ఇది జరగాలంటే ప్రతీ ఒక్కరు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలి, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలి. ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటునట్లు తెలిపారు.
ఇది ఛాలెంజ్ అనేకంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అందుకు సంతోష్ కుమార్ ను మనసారా అభినందిస్తున్నా.. వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతూ , మరో ముగ్గురు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్ , తమిళ్ నటుడు విజయ్ , నటి శృతి హాసన్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు .