
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్.. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా దారిలోనే తుదిశ్వాస విడిచారు. రమేష్ భార్య పేరు మృదుల. వారికి ఇద్దరు సంతానం.. భారతి, జయకృష్ణ. రమేష్ హఠాన్మరణం కుటుంబంతో పాటు ఇండస్ట్రీని, ఘట్టమనేని అభిమానుల్ని కూడా షాక్‌కి గురి చేసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలంటూ సినీ ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన రమేష్.. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘అల్లూరి సీతారామ రాజు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు–నీళ్లు వంటి చిత్రాల్లో నటించారు. 1987లో వి.మధుసూదనరావు తెరకెక్కించిన ‘సామ్రాట్’తో హీరోగా మారారు రమేష్. సోనమ్ హీరోయిన్‌గా, శారద కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం విజయం సాధించడంతో ఆయన ముందుకు
దూసుకెళ్లారు. చిన్నికృష్ణుడు, బజార్ రౌడి, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి లాంటి పదిహేను వరకు సినిమాల్లో హీరోగా నటించారు. ఎక్కువగా మధుసూదనరావు డైరెక్షన్‌లోనే సినిమాలు చేశారు రమేష్. ‘శాంతి ఎనత్తు శాంతి’ అనే తమిళ చిత్రంలోనూ నటించారు. హీరోగా ఆయన చివరి చిత్రం ‘పచ్చ తోరణం’. నటుడిగా చివరి చిత్రం.. ఎన్.శంకర్ తీసిన ‘ఎన్‌కౌంటర్’. ఇందులో సూర్యం అనే కీలక పాత్రలో కనిపించారు రమేష్.
స్పెషల్ జర్నీ
తండ్రి సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన రమేష్.. తన కెరీర్‌లో చాలాసార్లు తండ్రి కృష్ణతోను, తమ్ముడు మహేష్‌తోను కలిసి నటించారు. ఆ ఇద్దరితోనూ కలిసి చేసిన ‘ముగ్గురు కొడుకులు’ చిత్రం తన కెరీర్‌లోనే బెస్ట్ అండ్ మెమొరబుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రమేష్, మహేష్ ఆయనకి తమ్ముళ్లుగా నటించడం విశేషం. రమేష్ హీరోగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ చిత్రాన్ని కూడా కృష్ణనే డైరెక్ట్ చేశారు.
నిర్మాతగా..
ఓ సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రమేష్. ఆపైన 2004లో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించి, సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. మహేష్‌బాబుతో ‘అర్జున్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి ‘అతిథి’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకు డిగా ఉన్నారు. ‘సూర్యవంశం’ హిందీ రీమేక్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు.