రానున్న రోజుల్లో బీఎల్ఏలే కీలకం..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగిపోకుండా చూడాలి

రానున్న రోజుల్లో  బీఎల్ఏలే కీలకం..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగిపోకుండా చూడాలి
  •     ఎంపీలు, ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్
  •     పాల్గొన్న మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్

హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లే (బీఎల్ఏ) అత్యంత కీలకమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలతో జూమ్ వేదికగా సమావేశమయ్యారు. ఇందులో పార్టీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్ ఇన్ చార్జీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ‘సర్’ మొదటి దశ ముగిసిందని, ఇక రానున్న దశ అత్యంత కీలకమని పేర్కొన్నారు. పలు చోట్ల బీఎల్ఏలు సరిగ్గా పనిచేయలేదని గుర్తించామని, అలాంటి వారిని వెంటనే తొలగించి వారి స్థానంలో సమర్థులైన వారిని నియమించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా పార్టీ నేతలు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

ఓటరు జాబితాలో తిరస్కరణకు గురైన ఓట్లు, పలు ఓట్ల నమోదు విషయంలో బీఎల్‌‌‌‌ఓలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై బీఎల్ఏలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులో బీఎల్‌‌‌‌ఓలు చెప్పే కారణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలంగా ఉండే ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలదేనని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లను అర్హులైన జాబితాలో చేర్చేందుకు అవసరమైన సరైన ఆధారాలను సమకూర్చి, బీఎల్‌‌‌‌ఓల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు.

కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు జరిగే కుట్రలను బీఎల్‌‌‌‌ఏలు సమర్థవంతంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌లో జరిగిన దారుణ ఘటనలను దృష్టిలో ఉంచుకుని నేతలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేదంటే అది నేరుగా పార్టీకే తీవ్ర నష్టమని స్పష్టం చేశారు. కాగా..మొదటి రోజు సమావేశంలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి పార్టీ నేతలతో మహేశ్ గౌడ్ చర్చించారు. కొనసాగింపుగా మంగళవారం జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.