అభివృద్ధి, సంక్షేమానికి జూబ్లీహిల్స్ జై : మహేశ్ కుమార్ గౌడ్

అభివృద్ధి, సంక్షేమానికి జూబ్లీహిల్స్ జై : మహేశ్ కుమార్ గౌడ్
  • ఈ  గెలుపు ప్రతి కార్యకర్తకు అంకితం: మహేశ్ కుమార్ గౌడ్​
  • ‌‌ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదన్న పీసీసీ చీఫ్​

నిజామాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ అన్నారు. రెండేండ్ల ప్రజాపాలనపై సంతృప్తిగా ఉన్నట్టు రిజల్ట్స్​తో స్పష్టం చేశారన్నారు. ఉప ఎన్నికలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గెలుపు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు ఇవ్వని ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా సెలవు చెప్పారన్నారు. 

బీఆర్ఎస్ ఇక గతమని.. ఆ పార్టీకి భవిష్యత్​లేదన్నారు. బీసీ రిజర్వేషన్​ను అడ్డుకుంటున్న బీజేపీకి కూడా సరైన బుద్ధి చెప్పారన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ప్రజలు నమ్మారన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తం

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డి శ్రద్ధ పెట్టారని, సెకెండ్ ఫేజ్ మెట్రో, మూసీ సుందరీకరణకు ప్రజలు మద్దతిచ్చారని మహేశ్ గౌడ్ అన్నారు. గతంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్​గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ విజయమని ఖాయమని ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. ప్రజా మద్ధతు కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ పదవికి కేటీఆర్ రిజైన్​చేయాలని, బండి సంజయ్ గుండు కొట్టించుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 

ఈ ఎన్నిక రెండేళ్ల పాలనకు రెఫరెండం అన్న కేటీఆర్, సంజయ్​ ఫలితాల తర్వాత మాట మార్చారన్నారు. జూబ్లీహిల్స్​ విజయం మహేశ్ గౌడ్ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.