అట్టుడికిన నిర్మల్​.. కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులు

అట్టుడికిన నిర్మల్​.. కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులు
  • మాస్టర్​ ప్లాన్​ కు వ్యతిరేకంగా నాలుగో రోజూ కొనసాగిన మహేశ్వర్​ రెడ్డి దీక్ష
  • మద్దతుగా వచ్చిన కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులు
  • ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి

నిర్మల్, వెలుగు:  బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా శనివారం బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రాస్తారోకో చేపట్టారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బస్టాండ్  ముందు రోడ్డుకు ఇరువైపులా బైఠాయించి నిరసన తెలిపారు.  మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  వెంటనే  పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.  

దీంతో పోలీసుల తీరు నిరసిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కొంతసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జి చేసి అక్కడ నుంచి బలవంతంగా వాహనాల్లో తరలించారు.  పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్ రావుల రామనాథ్, పార్లమెంట్ ఇన్​చార్జ్ ఆయన గారి భూమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, జడ్పీటీసీ రమణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, ప్రెసిడెంట్ సాదం అరవింద్, జనరల్ సెక్రెటరీ అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

నిలకడగా మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం..

మహేశ్వర్ రెడ్డి  నాలుగు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కారణంగా ఆయన ఆరోగ్యం క్రమంగా బలహీనపడ్తున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ బీపీ, పల్స్ రేట్ తగ్గుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న కారణంగా మహేశ్వర్ రెడ్డి హెల్త్​ కండీషన్​ మరింత క్షీణించవచ్చని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మహేశ్వర్ రెడ్డి చేత దీక్ష విరమింపజేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాత్రి 8 గంటలకు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. 

ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా?బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి 

నిర్మల్​లో రాస్తారోకో చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం వాటిని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నదని మండిపడ్డారు. నిర్మల్​ మాస్టర్​ ప్లాన్​ను వ్యతిరేకిస్తూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న మహేశ్వర్​ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నిర్మల్​ మాస్టర్​ ప్లాన్​ వెనక్కి తీసుకోకుంటే సీఎం కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని కిషన్​ రెడ్డి హెచ్చరించారు.