
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4)లో తమ కన్సాలిడేటెడ్ నికర లాభం 13.34 శాతం పెరిగి రూ.3,541.85 కోట్లకు చేరుకుందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రకటించింది. ఆటో, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్లు మంచి పనితీరు కనబరిచాయని తెలిపింది.
కిందటేడాది మార్చి క్వార్టర్‌లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,124.94 కోట్లుగా ఉంది. రెవెన్యూ రూ.35,373.34 కోట్ల నుంచి రూ.42,585.67 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు రూ.32,172.17 కోట్ల నుంచి రూ.39,113.61 కోట్లకు చేరుకున్నాయి. క్యూ4లో కంపెనీ 2,53,028 బండ్లను విక్రయించింది.
కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 2,15,280 యూనిట్లను అమ్మింది. ఇది 18 శాతం గ్రోత్‌కు సమానం. ట్రాక్టర్ సేల్స్ 23 శాతం వృద్ధి చెంది 71,039 యూనిట్ల నుంచి 87,138 యూనిట్లకు పెరిగాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.14,073.17 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.12,269.82 కోట్లుగా నమోదైంది.
కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.1,38,279.30 కోట్ల నుంచి రూ.1,58,749.75 కోట్లకు చేరుకుంది. షేర్‌కు రూ.25.30 ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఎం అండ్ ఎం షేర్లు సోమవారం 3.26 శాతం పెరిగి రూ.3,022 వద్ద ముగిశాయి.