రేవంత్ రెడ్డి పక్కా ఆర్​ఎస్​ఎస్ మనిషి : మహమూద్ అలీ

రేవంత్ రెడ్డి పక్కా ఆర్​ఎస్​ఎస్ మనిషి :  మహమూద్ అలీ

షాద్ నగర్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన మొదట ఆర్ఎస్ఎస్ లో పనిచేసి బీఆర్ఎస్, టీడీపీ కండువాలు కప్పుకుని చివరకు కాంగ్రెస్ లో సెటిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో  జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హోంమంత్రి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పేద మైనార్టీలకు న్యాయం చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్ మత విద్వేషాలకు ఎందరో మైనార్టీలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి విద్యను దూరం చేసి రాజకీయంగా ఆడుకున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014 నుంచి 2016 వరకు కేవలం రెండేండ్లలోనే 204 గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశామని వివరించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిరుపేద యువతుల వివాహాల కోసం కేవలం రెండు కోట్లు కేటాయిస్తే.. కేసీఆర్ రూ.2300 కోట్లు షాదీ ముబారక్ నిధులు ఇచ్చారని వెల్లడించారు. బీజేపీతో బీఆర్ఎస్ ఎప్పుడూ దోస్తీ చేయదని మహమూద్ అలీ స్పష్టం చేశారు. రేవంత్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మొద్దని..మైనార్టీలంతా బీఆర్ఎస్ కే ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు.