బహిష్కరణను సుప్రీంలో సవాల్ చేసిన మహువా

 బహిష్కరణను సుప్రీంలో సవాల్ చేసిన మహువా

న్యూఢిల్లీ : ‘ప్రశ్నకు నోటు’ కేసులో లోక్ సభ తనపై విధించిన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆమెను అనైతిక ప్రవర్తన ఆరోపణలతో డిసెంబర్ 8న  లోక్ సభ నుంచి బహిష్కరించారు. అంతకు ముందు..లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరా నందనీ నుంచి మహువా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

ఈ ఆరోపణలపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి ఓ రిపోర్టును సమర్పించింది. ఆమె సభా ధిక్కార చర్యలకు పాల్పడిందని తెలిపింది. లోక్ సభ ఐడీ, పాస్ వర్డ్ ను హీరానందనీకి ఇచ్చిందని చెప్పింది. మహువాను దోషిగా తేలుస్తూ చర్యలకు సిఫారసు చేసింది. ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరింది. ఆ తర్వాత ఎథిక్స్ కమిటీ రిపోర్టుపై లోక్ సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఆమెపై బహిష్కరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా లోక్ సభ మూజువాణీ ఓటుతో  ఆమోదించింది. దీంతో మహువాపై బహిష్కరణ  వేటు పడింది.