- నిరుడి కంటే లక్ష ఎకరాలు ఎక్కువ
- 2.30 లక్షల ఎకరాల్లో పల్లీ, శనగ పంటలు
- వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో మక్కల సాగు జోరందుకుంటున్నది. ఈ సారి యాసంగిలో మక్కల సాగు భారీగా పెరిగిపోయి సాధారణ సాగును మించిపోయే అవకాశం ఉందని అగ్రిఎక్స్పర్ట్స్ అంటున్నారు. యాసంగి సాగులో ఇప్పటి వరకు అన్ని రకాల పంటలు కలిపి 7.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో దాదాపు సగం వరకు మక్కలే సాగు కాగా మిగతా పంటల్లో ప్రధానంగా పప్పుశనగ 1.28 లక్షల ఎకరాల్లో సాగు కాగా వేరుశనగ(పల్లీ) 1.04లక్షల ఎకరాల్లో వేసినట్లు వ్యవసాయశాఖ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
నిరుడు కంటే లక్ష ఎకరాలు ఎక్కువ..
ఈ సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 3.29లక్షల ఎకరాల్లో సాగైంది. ఖమ్మంలో 57,869 ఎకరాల్లో, మహబూబాబాద్ లో 45,215 ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే టైమ్‌లో 2.31లక్షల ఎకరాల్లో మక్కలు సాగు కాగా ఈయేడు నిరుడు కంటే దాదాపు లక్ష ఎకరాల్లో అధికంగా వేశారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే ఇంత పెద్ద ఎత్తున మక్కల సాగు షురూ కావడంతో సీజన్ ముగిసే నాటికి ఈ యేడు మక్కల సాగు రికార్డులు సృష్టించనుందని ప్రభుత్వ గణాంకాలతో స్పష్టమవుతున్నది. గత రెండేళ్లుగా మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా రంగంలోకి దింపి సర్కారు మక్కలు కొనుగోలు చేస్తున్నది. ఇలా మార్కెటింగ్ ఇబ్బందులు తప్పడంతో యాసంగిలో మక్కల సాగు గణనీయంగా పెరుగుతున్నది.
70 లక్షల ఎకరాల మార్క్ దాటే చాన్స్
వర్షాలు విస్తారంగా కురువడంతో చెరువుల్లో, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ బోరు బావులన్నీ ఫుల్ రీచార్జ్ అయి కనిపిస్తున్నాయి. పరిస్థితులు పంటలసాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి పంటల సాధారణ సాగు విస్తీర్ణం 68.67లక్షల ఎకరాలు కాగా ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ముందుగా వరి కోతలు పూర్తయిన జిల్లాల్లో నీటి వనరులున్న చోట ఇప్పటికే పొలాలు దున్ని నాట్లు వేస్తున్నరు. కోతలు ఆలస్యమైన చోట ఇప్పుడిప్పుడే వరినాట్లకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వచ్చే నెల నాటికి యాసంగి వరి నాట్లు ఊపందుకోనున్నాయి.

