ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై  మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో ఏర్పాటుచేసిన సభలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. షాహీన్ బాగ్ మున్సిపల్ వార్డు నుంచి ఎంఐఎం అభ్యర్థిని  కార్పొరేటర్ గా గెలిపించుకోవాలని స్థానికులను కోరారు.  

ఢిల్లీ ప్రజలందరికీ ఉచితంగా నీళ్లు ఇస్తున్నానని అరవింద్ కేజ్రీవాల్ ప్రపంచమంతటా చెప్పుకుంటున్నప్పటికీ.. స్థానికంగా అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. ఢిల్లీ ప్రజలకు తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకట్లేదని ఓవైసీ చెప్పారు. ఇక్కడి భూగర్భ జలాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని.. దాన్ని తగ్గించేందుకు కేజ్రీవాల్ సర్కారు ఇప్పటిదాకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని వాళ్లకు ఓటు అడిగే హక్కు ఉండదన్నారు. 

ముస్లింలు అత్యధికంగా నివసించే ఓఖ్లా ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క సర్కారీ ఆస్పత్రిని కూడా నిర్మించలేదని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ధైర్యం ఉంటే ఓఖ్లా ప్రాంతంలో పర్యటించాలని ఓవైసీ సవాల్ విసిరారు. కొవిడ్ వ్యాప్తిని ఓ వర్గం వారిపై రుద్ధిన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాలేనని కామెంట్ చేశారు.