- 40 తులాల గోల్డ్, 3.7 కిలోల వెండి, రూ.2.45 లక్షల చోరీ
మల్కాజిగిరి, వెలుగు: కుషాయిగూడలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. స్థానిక వ్యాపారవేత్త జె. ఆనంద్ గుప్తా శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలను చాకచక్యంగా తెరిచి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, 3.7 కిలోల వెండి వస్తువులు, రూ. 2.45 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
సాయంత్రం 4:20 గంటల ప్రాంతంలో బాధితుడి అల్లుడు మణికంఠ ఇంటికి వచ్చి చూడగా, తలుపులు తెరిచి ఉండటంతో పాటు లోపల సామాగ్రి చిందరవందరగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
