నల్గొండ: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ధర్మకర్త శ్రావణయ్య షాపులో మొదట మంటలు చెలరేగినట్లు సమాచారం. అక్కడి నుంచి పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. 15 పెద్ద దుకాణాలు, 15 చిన్న దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సుమారు ₹75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. గ్రామ పంచాయతీ భవనం కూడా మంటల్లో దగ్ధమైంది. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
ఏకాదశి సందర్భంగా చెరువుగట్టుకు భక్తులు భారీగా తరలివెళ్లారు. మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. షాపుల్లో నాణ్యమైన విద్యుత్ వైరింగ్, ప్రమాణాలకు అనుగుణమైన మీటర్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
చిన్న దుకాణాల్లో అధికంగా సామగ్రి నిల్వ చేయడం, రోడ్డుపైనే మెటీరియల్స్ వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి .. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
