హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ రోడ్డులోని బచ్చ క్రిస్టల్ ఫర్నీచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పై అంతస్తులకు వ్యాపించాయి. బిల్డింగ్‌లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది. ప్రాణాలకు తెగించి బిల్డింగ్‌లో ఉన్న పిల్లలను బయటకు తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
దీంతో పిల్లల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
