మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ వేటలో CSK, KKR, MI, Delhi

మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ వేటలో CSK, KKR, MI, Delhi

ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడుతున్నారా! డోంట్ వర్రీ. క్రికెట్ అభిమానుల ఆకలిని తీర్చడానికి మరో క్రేజీ టీ20 క్రికెట్ లీగ్ సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ టోర్నీ జులై 30న ముగియనుంది.

ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. నాలుగు జట్లను ఐపీఎల్ ప్రాంఛైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. మిగిలిన రెండు జట్లను భారత సంతతి వ్యక్తులే దక్కించుకోవడం విశేషం. వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీ (వాషింగ్టన్ ఫ్రీడమ్)ని సంజయ్ గోవిల్ కొనుగోలు చేయగా, శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు(శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్)ను ఆనంద్ రాజరామన్, వెంకీ హరినారాయణ్‌లు దక్కించుకున్నారు.   

మేజర్ లీగ్ క్రికెట్‌లో అంతర్జాతీయ స్టార్లు కనిపించనున్నారు. జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్, ఆన్రిచ్ నోర్జ్, వనిందు  హసరంగ వంటి మరికొందరు ప్లేయర్లు ఈ టోర్నీలో అలరించనున్నారు.

ఆరు జట్లు ఇవే.. 

  • టెక్సాస్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)
  • లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కోల్ కతా నైట్ రైడర్స్) 
  • సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీ క్యాపిటల్స్) 
  • ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్) 
  • వాషింగ్టన్ ఫ్రీడమ్ 
  • శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 

మేజర్ లీగ్ క్రికెట్ షెడ్యూల్

తొలి లీగ్ మ్యాచ్(జులై 13న) టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జరుగనుండగా, చివరి లీగ్ మ్యాచ్(జులై 25న) ముంబై న్యూయార్క్, సీటెల్ ఆర్కాస్ మధ్య జరగనుంది. జులై 27న ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచులు, 28న ఛాలెంజర్, జులై 30న ఫైనల్ జరుగనున్నాయి.