
గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లోనూ బీజేపీని గెలపించాలని ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అక్కడ శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం వెరావల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ‘ప్రతి బూత్‌లోనూ బీజేపీ గెలవాలి. నా కోసం ఇది చేస్తారా..? ఈసారి అన్ని పోలింగ్ బూత్‌లలో గెలవడంపైనా దృష్టి పెట్టాను. ఈ విషయంలో మీరు సహకరిస్తే.. ఈ జిల్లాలోని నలుగురు బీజేపీ నేతలు అసెంబ్లీకి చేరతారు’ అని మోడీ అన్నారు.
పోలింగ్ రోజున ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని మోడీ కోరారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. బీజేపీని గద్దెదించాలని కాంగ్రెస్, ఆప్ ప్రయత్నాలు చేస్తున్నాయి.