రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు తీరని అన్యాయం... ఈ విధానాన్ని వెంటనే సవరించాలి: మాల సంఘాల జేఏసీ డిమాండ్

రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు తీరని అన్యాయం... ఈ విధానాన్ని వెంటనే సవరించాలి: మాల సంఘాల జేఏసీ డిమాండ్
  • సెక్రటేరియెట్​లో మంత్రి వివేక్​కు వినతిపత్రం అందజేత
  • పాల్గొన్న 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు

ముషీరాబాద్/ఓయూ, వెలుగు: రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు తీరని అన్యాయం జరుగుతున్నదని మాల సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని సవరించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ నేతృతంలో 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు శనివారం సెక్రటేరియెట్​లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. 

రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు నష్టం జరకుండా న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన 99 జీవోతో తెలంగాణలోని 40 లక్షల మంది మాల సమాజానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందని మంత్రికి లెక్కలతో సహా జేఏసీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మందాల భాస్కర్, బేర బాలకిషన్ మాట్లాడుతూ.. 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాల, మాల అనుబంధ కులాలకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లకు అవకాశం లేకుండా పోతుందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. 30 ఏండ్లుగా మాలలు రిజర్వేషన్లను, సంక్షేమం పథకాలను పొందారని మందకృష్ణ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికీ మాదిగ కులానికి చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని, సంక్షేమ పథకాలు పొందుతున్నది కూడా వారేనని విమర్శించారు. మంత్రిని కలిసిన వారిలో తాళ్లపల్లి రవి, రాహుల్ రావు, బీవీ స్వామి, నగేశ్ నర్సింగ్ రావు, రవి పవన్ తో పాటు 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. 

వీరితోపాటు మాల స్టూడెంట్ జేఏసీ సంఘాల నాయకులు మంత్రిని కలిశారు. ఓయూలోని పీహెచ్​డీ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ జీవో 99ను అమలు చేయకూడదని కోరారు. నోటిఫికేషన్ జనవరిలో విడుదల అయిందని.. కానీ, జీవో 99 మాత్రం ఏప్రిల్ నెలలో అమల్లోకి వచ్చిందన్నారు. అలాగే, ఓయూలోని మాల విద్యార్థులు, మాల ఉద్యోగుల సమస్యలపై వీసీతో చర్చించి  వినతి పత్రం అందజేశారు.