
- హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య వెల్లడి
బషీర్బాగ్, వెలుగు: మాలలు, మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న మాలల రణభేరి పేరిట చలో హైదరాబాద్ కు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈ రణభేరి సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు చెన్నయ్య తెలిపారు. ఈ రణభేరి సభకు లక్షలాదిగా మాలలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.
అభివృద్ధి చెందిన మాదిగలకు 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చి , మాలలకు కేవలం 5 శాతమే ఇచ్చారని తెలిపారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడారు. కొత్తగా తీసుకొచ్చిన రోస్టర్ విధానంతో విద్య , ఉద్యోగాలలో మాలలు నష్టపోతున్నారని చెప్పారు. ఎంపిరికల్ డేటాను పరిగణనలోకి తీసుకోకుండా, జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో బూర్గుల వెంకటేష్, కమ్మతోటి పౌల్, మధుబాబు, ఎ.కేశవులు, సరళ, పి.కోటేశ్వరరావు, ఆనంద్ రావు, శ్రీకాంత్, జైకుమార్, లలిత, సుమలత, అనిల్, బాలకృష్ణ, సుధాకర్, మోహనకృష్ణ పాల్గొన్నారు.