కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు

కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు
  • మాల మాహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) ఫ్యామిలీని విమర్శించే నైతిక అర్హత మందకృష్ణకు లేదని మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. తెలంగాణలో సంపన్న దళితులు మాలలు అని, పార్లమెంట్ ను కబ్జా చేశారంటూ కాకా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ  వెనక్కి తీసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వేల కుటుంబాలల్లో దివంగత వెంకటస్వామి వెలుగులు నింపారని..ఈ విషయం మరిచి మందకృష్ణ దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని పిల్లి సుధాకర్ మండిపడ్డారు. కార్మిక , సివిల్ సప్లై శాఖ మంత్రిగా కాకా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, సీడబ్ల్యూసీ మెంబర్ గా తెలంగాణ ఏర్పాటుకు సోనియాను ఒప్పించారని గుర్తుచేశారు.

లక్షలాది మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారిని తలెత్తుకొని జీవించేలా చేశారని చెప్పారు. మందకృష్ణ ప్రతీసారీ కాకా కుటుంబాన్నే టార్గెట్ చేయడం చూస్తుంటే మాలలపై ఆయనకు ఎంత  ద్వేషం ఉందో అర్థమవుతోందన్నారు. కాకా కుటుంబం ఒక కులానికి పరిమితమైన కుటుంబం కాదని, వారు అందరివారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  చిన్న వయసులో పార్లమెంట్ కు వెళ్లిన గడ్డం వంశీని  అభినందిచకుండా ఇంత ఈర్ష్య పనికిరాదన్నారు. కాకా కుటుంబంతో పాటు మల్లు కుటుంబాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. విమర్శలు మాని దళితుల అభివృద్ధికి కృషిచేయాలని మంద కృష్ణకు పిల్లి సుధాకర్ హితవు పలికారు.