- మరో తొమ్మిది మంది కూడా దుర్మరణం
బ్లాంటైర్: మలావీలో మిలిటరీ విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలస్ చిలిమా(51), మాజీ అధ్యక్షుడు బకిలి ములుజీ భార్య షానిల్ డిజింబిరీ సహా 10 మందితో ప్రయాణిస్తున్న విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు. విమానం శకలాలను గుర్తించామని.. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు.
జుజులో ఓ మాజీ మంత్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సౌలస్ చిలిమా, మరో తొమ్మిది మంది మిలిటరీ విమానంలో సోమవారం ఉదయం లిలాంగ్వే నుంచి బయలుదేరారు. 370 కిలోమీటర్ల దూరంలోని జుజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్లేన్ 45 నిమిషాల్లో చేరాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలాంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సూచించింది.
ఈ క్రమంలోనే రాడార్ తో విమాన సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావీ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ దాదాపు 600 మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. వారికి అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించాయి. ఈ క్రమంలోనే 24 గంటల సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూలిపోయిన విమాన శకలాలను జుజు సమీపంలోని చికన్‌గావా ఫారెస్ట్‌లో ఉన్న ఓ కొండ దగ్గర గుర్తించినట్లు మలావీ ప్రభుత్వం పేర్కొంది.