
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్ తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ పేర్కొంది. మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్ జిహాన్ లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.
భారత్ తోపాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా.. మోదీ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు బాయ్ కాట్ మాల్దీవులు అనే హాష్ ట్యాగ్ ని సోషల్ మీడియా ఎక్స్ లో ట్రెండ్ చేశారు. ఆ దేశానికి వెళ్లాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న దాదాపు 90 వేల మంది భారతీయులు టూర్ ను క్యాన్సల్ చేసుకున్నారు.