
ఇండియా, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు, నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనపై తమ అక్కసు వెళ్లగక్కారు. టూరిజం విషయంలో తమతో పోటీ పడేంత సీన్ భారత్‌కు లేదంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ‘మా టూరిస్టుల ఆదాయంతో బతుకుతూ.. మాపైనే విద్వేషం చిమ్ముతరా?’ అంటూ సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడు తున్నారు. ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 వేలకుపైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు దేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో దెబ్బకు మాల్దీవులు ప్రభుత్వం దిగొచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
ఇండియా, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవులు మంత్రులు, ఇతర నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల లక్షద్వీప్‌లో మోదీ చేసిన పర్యటనపై వాళ్లు చేసిన అవమానకర కామెంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తులను సస్పెండ్ చేస్తున్నట్లు మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మాల్దీవులకు టూర్లు ప్లాన్ చేసుకున్న వాళ్లు కూడా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల లక్షద్వీప్‌లో మోదీ పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. వీటిని కొందరు షేర్ చేయగా.. మాల్దీవ్స్ యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియునా.. ప్రధాని మోదీపై అనుచిత, వివాదాస్పద కామెంట్లు చేశారు. తర్వాత వాటిని డెలీట్ చేశారు. ఎంపీ జాహీద్ రమీజ్ కూడా లక్షద్వీప్‌లో మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులుపై పెద్ద దెబ్బ పడుతుందన్న వార్తలపై విమర్శలు చేశారు. ‘‘మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య” అని ట్వీట్ చేశారు. మరో మంత్రి అబ్దుల్లా మహ్‌జుమ్ మాజిద్.. తమ దేశాన్ని ఇండియా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ‘‘మాల్దీవులు నుంచి లక్షద్వీపాలకు ఫోకస్‌ను ఇండియా షిఫ్ట్ చేస్తున్నది. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేస్తున్నది. బీచ్ టూరిజం విషయంలో మాల్దీవులుతో పోటీపడడంలో భారత్ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంది” అంటూ చెప్పారు. ‘ఇది మీ కల్చర్ మోదీ’అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
తమకు సంబంధం లేదంటూనే..
మోదీపై మాల్దీవులు మంత్రులు, నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాలెలో మాల్దీవులు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఇండియన్ హైకమిషనర్ తీసుకెళ్లారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘భారతదేశాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్ట్‌లకు సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పదవుల్లో ఉంటూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ లు చేసిన వారిని సస్పెండ్ చేశాం” అని తెలిపింది. అయితే వారి పేర్లను కానీ, ఎంత మందిని సస్పెండ్ చేశారని కానీ వెల్లడించలేదు. స్థానిక మీడియా ప్రకారం.. మరియం షియునా, మాల్షా షరీఫ్, అబ్దుల్లా మహ్‌జుమ్ మాజిద్‌లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తున్నది. అంతకుముందు ఓ ప్రకటన రిలీజ్ చేసిన మాల్దీవులు ప్రభుత్వం.. నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ‘‘విదేశీ నాయకులు, ఉన్నత స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చేసిన అవమానకర వ్యాఖ్యల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ అభిప్రాయాలు వ్యక్తిగతం. వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని మేం నమ్ముతాం. మాల్దీవులు, దాని అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సంబంధాలు దెబ్బతినేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకూడదు” అని మాల్దీవులు విదేశాంగ శాఖ చెప్పింది. అవమానకరమైన వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పింది. తమ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలను మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ఖండించారు.
ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’
మాల్దీవులు మంత్రులు, ఇతర నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్)లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. మాల్దీవులు టూర్‌కు వెళ్లొద్దని, లక్షద్వీప్ సహా మన దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్ తదితరులు ఉన్నారు. తన 50వ పుట్టిన రోజును మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో బీచ్‌లో చేసుకున్న విషయాన్ని సచిన్ ప్రస్తావించారు. ‘‘మమ్మల్ని కించపరుస్తూ, తక్కువ చేసిన మాట్లాడుతు న్నారు.. మేం ఎప్పుడూ మా పక్క దేశాలతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తాం.. కానీ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే దేశం మీదే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విద్వేషాన్ని ఎందుకు భరించాలి” అని అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనకు డిగ్నిటీ ముఖ్యం.. ఇకపై మన దేశంలో ఉన్న ఐలాండ్‌లను ఎంకరేజ్ చేద్దాం” అని ట్వీట్ చేశారు. మరోవైపు, చాలా మంది మాల్దీవ్స్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేసుకున్న స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నా రు. ఇప్పటి వరకు 8 వేల హోటల్ బుకింగ్స్, 2500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తున్నది.