కాంగ్రెస్​కు  నందికంటి శ్రీధర్ రాజీనామా

కాంగ్రెస్​కు  నందికంటి శ్రీధర్ రాజీనామా
  • మైనంపల్లి చేరడంతోనే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన
  • కేసులు పెట్టి వేధించిన వ్యక్తితో ఇమడలేనంటూ ఆవేదన
  • భవిష్యత్​ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

అల్వాల్ వెలుగు: మల్కాజిగిరి కాంగ్రెస్ ఇన్​చార్జ్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందికంటి మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన తనకు సరైన అవకాశాలు రాలేదన్నారు. అయినా పార్టీ ఆదేశాల మేరకు1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, పార్టీకి విధేయుడిగా ఉంటూ ఎంతో సేవ చేశానని బాధను వ్యక్తం చేశారు. 2018లో టికెట్ వస్తుందని భావించినా, పొత్తుల కారణంగా రాలేదన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి ఈసారి ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ టికెట్​ఇస్తుందని భావిస్తే.. మల్కాజిగిరి మెదక్ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇబ్బంది పెట్టిన  వ్యక్తిని చేర్చుకుంటారా?

ఎన్నో ఏండ్లుగా మల్కాజిగిరికి చెందిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో పోరాడానని, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా.. వెనక్కి తగ్గకుండా పార్టీనే తనకు సర్వస్వమని పనిచేసినట్లు నందికంటి శ్రీధర్ ​తెలిపారు. అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి పార్టీ శ్రేణులపై కేసులు పెట్టిన మైనంపల్లికి టికెట్ కేటాయించాలనుకోవడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరికీ టికెట్లు ప్రకటించి కాంగ్రెస్ బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసిందని, అందుకే డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. కార్యకర్తలతో సమావేశమై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పారు.