మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో ..గెలిస్తే పెద్ద పదవే

మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో ..గెలిస్తే పెద్ద పదవే
  • గత మూడు ఎన్నికల్లో గెలిచిన వారికి ఉన్నత స్థానాలు

  • ఒకరికి కేంద్ర మంత్రి, మరొకరికి రాష్ట్ర మంత్రి, ఇంకొకరికి ఏకంగా సీఎం పోస్టే

  • ఇక్కడ విజయం సాధిస్తే.. సుడి తిరిగినట్లే అంటున్న నాయకులు

హైదరాబాద్, వెలుగు :  దేశంలోనే అతి‌‌‌‌‌‌‌‌పెద్ద లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో ఎంపీలుగా గెలిచిన నేతలకు బాగా కలిసొస్తున్నది. ఇక్కడి నుంచి గెలిచిన నాయకులను పెద్ద పదవులు వరిస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లో ఈ సెగ్మెంట్​నుంచి గెలిచిన ముగ్గురిలో ఒకరు కేంద్ర మంత్రి కాగా.. మరొకరు రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇంకొకరు ఏకంగా ముఖ్యమంత్రి కావడం గమనార్హం. దీంతో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎంపీగా గెలిస్తే.. సుడి తిరిగినట్లే అనే అభిప్రాయంలో ప్రధాన పార్టీల నాయకులు ఉన్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్​లో భాగంగా 2009లో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానం ఏర్పడింది. ఆవిర్భావంతోనే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా రికార్డు సృష్టించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వివరాల ప్రకారం.. ఈ నియోజకవర్గంలో 37,28,417 ఓటర్లు ఉన్నారు. దేశంలోని ఏ లోక్‌‌‌‌‌‌‌‌సభ పరిధిలో కూడా ఇంతమంది ఓటర్లు లేరు. దీని పరిధిలో మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపుర్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, ఉప్పల్, ఎల్‌‌‌‌‌‌‌‌బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ స్థానానికి 2009, 2014, 2019లో ఎన్నికలు జరగ్గా.. సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి గెలిచారు.  

  • మన్మోహన్ సింగ్ కేబినెట్‌‌‌‌‌‌‌‌లో సర్వే సత్యనారాయణ 

2009 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి నుంచి కాంగ్రెస్ తరఫున సర్వే సత్యనారాయణ పోటీ చేసి గెలిచారు. 2012లో జరిగిన యూపీఏ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గానికి ఎన్నికైన ఎంపీకి కేంద్రమంత్రి పదవి దక్కడం కూడా అరుదైన ఘటనే. 2014 వరకు సర్వే సత్యనారాయణ కేంద్రమంత్రిగా కొనసాగారు.

  • కేసీఆర్ మంత్రివర్గంలో మల్లారెడ్డి 

2014  ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున చామకూర మల్లారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి గెలిచిన కొద్ది రోజులకే ఆయన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం కేసీఆర్ కేబినెట్‌‌‌‌‌‌‌‌లో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత గత పదేండ్లలో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో పాపులర్​అయ్యారు.   

  • రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి

2019 ఎన్నికల్లో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి ఇక్కడ గెలిచిన తర్వాతే రేవంత్ రెడ్డి దశ తిరిగిందని చెప్పాలి. ఎంపీగా గెలిచిన రెండేండ్లకు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తారా జువ్వలా దూసుకుపోయారు. తెలంగాణ సమకాలీన రాజకీయాల్లో పదునైన భాషతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో అన్ని విషయాలను వివరించి చెప్పి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

  • సంప్రదాయం కొనసాగుతుందా?  

త్వరలో జరగనున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి స్థానానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ తరఫున సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే, సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్.. ఇక్కడ బోణీ కొట్టాలని బీజేపీ.. ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఎంపీ స్థానాన్ని కూడా కట్టబెడతారని బీఆర్ఎస్ కోటి ఆశలు పెట్టుకున్నాయి. గత పరిణామాల దృష్ట్యా మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి  నుంచి గెలిస్తే.. అదృష్టం వరిస్తుందన్న  నమ్మకంలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ పోరులో ఎవరు  గెలుస్తారు? గత మూడు ఎన్నికల సంప్రదాయం కొనసాగుతుందా?  గెలిచి వారికి పెద్దపదవి వరిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే.. మరికొంతకాలం ఆగాల్సిందే.