- బోర్డు చైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న వక్ఫ్ బోర్డు భూముల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. మంగళవారం వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజమతుల్లా హుస్సేన్, సీఈఓ మహ్మద్ అసదుల్లాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. తప్పుగా నమోదైన సర్వే నంబర్ల వల్ల వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ప్రజల వద్ద ఉన్న సేల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్లు, పహాణీ పత్రాల ప్రకారం ఆ భూములు పూర్తిగా చట్టబద్ధమైనవేనని స్పష్టం చేశారు. వివాదాస్పద భూములు మల్కాజిగిరి పరిధిలోకి రావని హైకోర్టు తీర్పులు, కలెక్టర్ ఉత్తర్వులు, సర్వే రిపోర్టులు చెబుతున్నా.. ఆ సర్వే నంబర్లను 22-ఏ (నిషేధిత జాబితా)లో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నారు. వెంటనే ఆ నంబర్లను జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరగా, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
