మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం

మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం
  •     పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిగా సెల్ఫ్​ హెల్ప్​గ్రూపులకు  సీపీ సుమతి శ్రీకారం

మల్కాజ్ గిరి, వెలుగు: మహిళల భద్రత, వారిపై జరుగుతున్న నేరాల నివారణకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నది. ‘మీ సురక్ష - సహచరి’ పేరుతో రూపొందించిన కమ్యూనిటీ పోలీసింగ్ పథకాన్ని మంగళవారం కమిషనర్ సుమతి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా పోలీసు వ్యవస్థకు, ప్రజలకు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్​పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్​లో , ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు సంబంధించి నాగోల్​శుభం కన్వెన్షన్ సెంటర్​లో మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించనున్నారు.

3,195 మంది సేఫ్టీ అంబాసిడర్లు 

‘మీ సురక్ష - సహచరి’ లో భాగంగా తొలి దశలో 3,195 మంది స్వయం సహాయక సంఘ మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తయారు చేయనున్నారు. వీరికి మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, డ్రగ్స్​నివారణ, రోడ్డు భద్రత, న్యాయపరమైన హక్కులపై శిక్షణ ఇస్తారు. వీరు కమిషనరేట్ పరిధిలో మిగతా 2.70 లక్షల మంది సెల్ఫ్​హెల్ప్​గ్రూపులకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకుంటారు. శిక్షణలో భాగంగా సెల్ఫ్​హెల్ప్​గ్రూపు మహిళలు పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు, డబ్ల్యూడీసీడబ్ల్యూ కేంద్రాలను విజిట్​చేసి పోలీసు సేవల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.