మల్లారెడ్డి.. రాజీనామా చెయ్‌‌ : ఎన్ఆర్ఐ శేరి శ్రీనివాస్ రెడ్డి

మల్లారెడ్డి.. రాజీనామా చెయ్‌‌ : ఎన్ఆర్ఐ శేరి శ్రీనివాస్ రెడ్డి
  •  సర్వేలో నా జాగా కరెక్టు గానే ఉంది 

ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని సుచిత్ర వద్ద సర్వే నంబర్‌‌‌‌ 82లో తాను కొనుగోలు చేసిన స్థలం కరెక్ట్‌‌గానే ఉందని ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ శేరి శ్రీనివాస్‌‌ రెడ్డి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో  భూమి పాత యజమాని సుధామా, మహ్మద్‌‌ బషీర్‌‌‌‌, రాకేవ్‌‌, లింగారెడ్డితో పాటు శ్రీనివాస్‌‌ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన స్థలం వివాదంలో మొత్తం సర్వే చేయాలని, అందులో తేడా వస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటించారని, కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని చెప్పారు.

 ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో స్థలంలో సర్వే చేశామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిర్వహించిన సర్వేలో తాను కొనుగోలు చేసిన 33 గుంటల స్థలం కరెక్టుగానే ఉందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదే సర్వే నంబర్‌‌‌‌లో మల్లారెడ్డికి 1.29 ఎకరాలు ఉందన్నారు. 2016లో ఆయన బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరిన తర్వాత ఈ భూమిని ఆక్రమించుకుని అంతా తనదే అన్నారని పేర్కొన్నారు. 

అప్పట్లో ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం ఉండడంతో తాను ఏమీ మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, అందుకే సర్వేలో తన స్థలం తనకు దక్కిందన్నారు. అయితే, ఇప్పుడు ఆ సర్వే తప్పు అంటూ మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. తాను మొత్తం 9 మంది నుంచి ఈ సైట్‌‌ను కొనుగొలు చేశానని తెలిపారు. తన స్థలాన్ని తనకు అప్పగించాలని ప్రభుత్వానికి శ్రీనివాస్‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.