కాలం కలిసి వస్తే నేను  సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

కాలం కలిసి వస్తే నేను  సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్: దేవుడు సంకల్పిస్తే ఏమైనా జరగొచ్చన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.  భవిష్యత్తులో తాను సీఎం అవుతానా? అన్నది ఇప్పుడే చెప్పలేమని అయితే సీఎం కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? కాలం కలిసి వచ్చి ఆయన సీఎం కాలేదా? అని మల్లారెడ్డి అన్నారు. దేవుడి ఆశీస్సులతో ఏదైనా సాధ్యమేనని అన్నారు.

తన కోరికలు తీరుస్తున్న ఏడుకొండలవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని మల్లారెడ్డి తెలిపారు. తనకు ఇష్టమైన కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, అనంతరం తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు.మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మల్లారెడ్డి అన్నారు. ప్రజలు, కార్యకర్తలు తనకు అందిస్తున్న ఆదరణను జీవితాంతం మరచిపోలేనని అన్నారు. 

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి చేరుకున్న మల్లారెడ్డికి ఆయన 74వ జన్మదినం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలలు, పూల బొకేలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.