మాది రాజకీయ పార్టీ.. మంచి చేసే దిల్, దమ్ము కేసీఆర్ కే ఉంది!

మాది రాజకీయ పార్టీ.. మంచి చేసే దిల్, దమ్ము కేసీఆర్ కే ఉంది!
  • ఎన్నికలనుకో.. ఏమన్నా అనుకో
  • నిన్నటి దాక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డరు
  • వాళ్లకు న్యాయం జరిగిందా..? లేదా..?
  • వాళ్ల భవిష్యత్ మంచిగైందా..? లేదా..?
  • హాట్ టాపిక్ గా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం  ఎన్నికల స్టంట్ అని  కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇదంతా ఎన్నికల స్టంటేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఎన్నికలనుకో.. ఇంకా ఏమన్నా అనుకో.. మాది రాజకీయ పార్టీ వయా.. ఏమనుకుంటున్నవ్.. ఎన్నికలే అనుకో.. ఏదన్నా అనుకో.. కార్మికులకైతే న్యాయం జరిగిందా..? లేదా..? ఇయ్యాళ్ల వాళ్ల భవిష్యత్ మంచిగైందా లేదా..? ఇయ్యాలంతా వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తున్నమా లేదా..? గది ఆలోచన చెయ్యు వయా..? ఎన్నికలంటవ్.. అదంటవ్.. ఎన్నికలకు పోతున్నం.. ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటది.. మాది రాజకీయ పార్టీ.. కానీ చేసే దిల్ దమ్ము , ధైర్యం కావాలె.. వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాల్నంటె ఎంత ధైర్యం కావాలె.. ఎంత ఫండ్స్ కావాలె.. ఎంత దిల్ కావాలె..? అది మా కేసీఆర్ కే ఉంది.. ఆ గుండె’అని అన్నారు. 

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదని, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. నిన్నటి దాకా ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి నిన్నటి దాకా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం అనే విషయం మంత్రి మర్చిపోయారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్న క్యాబినెట్ లో పెద్ద ఎత్తున కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులకు డబుల్ క మీఠా.. డబుల్ ధమాకా ఇచ్చారని చెప్పారు. 

ఆర్టీసీ వాళ్లు తాము ప్రభుత్వ ఉద్యోగులం అవుతామని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారని మంత్రి కామెంట్ చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులనుప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించిందని, ప్రజారవాణశాఖ పేరుతో ఓ డిపార్ట్ మెంటును స్టార్ట్ చేసిందనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనే ఆర్టీసీ సంఘాలు ఏపీలో మాదిరిగా తమనూ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మంత్రి మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. సాక్షాత్తూ కార్మికశాఖ మంత్రే ఎన్నికల స్టంట్ అంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.