మల్లెపల్లి లక్ష్మయ్య కు సుబ్రమణ్యం అవార్డు ప్రదానం

మల్లెపల్లి లక్ష్మయ్య కు సుబ్రమణ్యం అవార్డు ప్రదానం
  •     సామాజిక న్యాయ పోరాటానికి గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: సెంటర్  ఫర్  దళిత్  స్టడీస్  చైర్​పర్సన్, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు మల్లెపల్లి లక్ష్మయ్యకు ప్రతిష్టాత్మక సి.సుబ్రమణ్యం కమ్యూనిటీ లీడర్ ​షిప్ అవార్డు లభించింది. ఢిల్లీలోని నేషనల్  ఫౌండేషన్  ఫర్  ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ కమిషన్ ఫర్  చైల్డ్  రైట్స్  చైర్​పర్సన్  రష్మీ సింగ్, ఎన్‌ఎఫ్‌ఐ చైర్​పర్సన్  సత్యానందన్ మిశ్రా (రిటైర్డ్  ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  విరాజ్ పట్నాయక్, ప్రాజెక్ట్  డైరెక్టర్  సమీరా, నేషనల్  క్యాంపెయిన్  ఫర్  దళిత్  హ్యూమన్  రైట్స్  ప్రతినిధి పాల్ దివాకర్ తదితరులు హాజరై లక్ష్మయ్యను సత్కరించారు.

క్షేత్రస్థాయిలో అట్టడుగువర్గాల సాధికారత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల బలోపేతం కోసం నిరంతరం కృషి చేసే నాయకులను భారతరత్న సి.సుబ్రమణ్యం స్మారకార్థం ఈ పురస్కారంతో  గౌరవిస్తారు. 

మల్లెపల్లి లక్ష్మయ్య దశాబ్దాలుగా దళిత, గిరిజన సమస్యలపై తన రచనలు, ఉద్యమాలతో పోరాడుతున్నారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ (ప్రస్తుతం ప్రత్యేక అభివృద్ధి నిధి) చట్టం పటిష్ట అమలు, బడ్జెట్ కేటాయింపుల్లో జవాబుదారీతనం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సీడీఎస్ చైర్​పర్సన్​గా పరిశోధన, విధానపరమైన నిర్ణయాల ద్వారా సామాజిక సమానత్వం కోసం ఆయన చేస్తున్న కృషికి నిదర్శనంగా ఈ అవార్డు నిలిచింది.