ఇండియా చైర్మన్​గా ఖర్గే?.. వర్చువల్​ భేటీలో నేతల ఏకాభిప్రాయం

ఇండియా చైర్మన్​గా ఖర్గే?..  వర్చువల్​ భేటీలో నేతల ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ చైర్‌‌పర్సన్‌‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది. శనివారం నిర్వహించిన వర్చువల్​భేటీలో వివిధ పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కాగా ఖర్గే ఎన్నికపై కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. జేడీయూ నేత, బిహార్‌‌ సీఎం నీతీశ్ కుమార్​కు చైర్​పర్సన్​తర్వాత హోదా కలిగిన ‘కన్వీనర్‌‌’ పదవిని ఇవ్వాలని సమావేశంలో ప్రతిపాదించగా.. దాన్ని నితీశ్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కన్వీనర్‌‌ పదవికి కూడా కాంగ్రెస్‌‌ పార్టీకి చెందిన వ్యక్తులనే ఎన్నుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. 

అయితే కన్వీనర్​పదవి విషయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌‌వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్‌‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. శనివారం వర్చువల్​గా జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో కాంగ్రెస్‌‌ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ, ఆప్‌‌ అధినేత అర్వింద్‌‌ కేజ్రీవాల్‌‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌‌ పవార్‌‌ సహా పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూటమి బలోపేతం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాల పైనా చర్చ జరిగింది. ఈ భేటీకి మమతా బెనర్జీ, అఖిలేశ్‌‌ యాదవ్‌‌, ఉద్ధవ్​థాక్రే గైర్హాజరయ్యారు. కూటమి ఛైర్‌‌పర్సన్‌‌గా ఖర్గే ఎంపికవడంతో వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతున్నది.

 ‘కన్వీనర్’​లేకుండానే ఎన్నికలకు: శరద్​పవార్​

‘ఇండియా’ కూటమికి కన్వీనర్‌‌ను నియమించే అవసరం లేదని, ఎన్‌‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. శనివారం ఆయన వర్చువల్​ మీటింగ్​కు హాజరైన తర్వాత పుణె జిల్లాలోని జున్నార్‌‌లో విలేకరులతో మాట్లాడారు.“నితీశ్ కుమార్‌‌ను కన్వీనర్‌‌గా నియమించాలని కూటమి సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. తర్వాత కన్వీనర్ ​అవసరం లేదని వివిధ పార్టీ ముఖ్యుల బృందం భావించింది.  ఓట్ల కోసం కూటమి తరఫున ఓ వ్యక్తిని ముందు నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత నాయకుడిని ఎన్నుకుంటాం. 1977లో మొరార్జీ దేశాయ్‌‌ను ప్రతిపక్షాలు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రదర్శించలేదు” అని అన్నారు. కాగా అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదని.. సీట్ల పంపకంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. రామ మందిర అంశంపై పవార్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని, అయితే ఇంకా నిర్మాణం పూర్తికాని ఆలయానికి ప్రారంభోత్సవం చేయడంలో బీజేపీ ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.