నామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే

నామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అభిషేక్ సింఘ్వీ, అజయ్ మాకెన్, భూపీందర్ సింగ్ హూడా, దిగ్విజయ్ సింగ్, తారీఖ్ అన్వర్ సహా 30 మంది నేతలు ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. మరోవైపు గాంధీ కుటుంబం సైతం మల్లిఖార్జున ఖర్గేకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత వేణుగోపాల్ ఈ విషయాన్ని ఖర్గేకు తెలియజేసినట్లు సమాచారం. 

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధంకాగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆయన ఆ అవకాశం కోల్పోయారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలిసిన అనంతరం తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంకాగా.. అనూహ్యంగా మల్లిఖార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. దీంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దిగ్విజయ్ సింగ్.. ఖర్గేకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టుకు అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా ఇవాళ్టితో నామినేషన్ దాఖలు గడువు పూర్తి కానుంది.