ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది  :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకున్న సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో ఖర్గే ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇందుకు సోనియా గాంధీ ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే టీఆర్ఎస్ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారని.. మొదట తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే... టీఆర్ఎస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. దీన్ని బట్టి కేసీఆర్, మోడీ ఒక్కటేనని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కలిసి కట్టుగా పని చేసుకుంటున్న ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

 

ప్రధానంగా మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ అని ఖర్గే అభివర్ణించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పక్కనే తన నియోజకవర్గం కూడా (కర్ణాటకలో) ఉందన్నారు. దేశాన్ని విడగొట్టాలని, విద్వేషాలు రెచ్చగొట్టాలని  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 13 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా.. మోడీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. కేవలం 75 వేల ఉద్యోగాలు ఇచ్చి.. గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అధికారంలోకి రాకముందు.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. జీఎస్టీ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు ఇలా ఎన్నో దేశాన్న చుట్టేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పాలన కొనసాగిస్తుండడం దారుణమన్నారు. అందరూ కలిసి కట్టుగా నిలబడి బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడవాలని రాహుల్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.