మోదీ జుమ్లాలు సూర్యున్ని తాకాయి : మల్లికార్జున్ ​ఖర్గే

మోదీ జుమ్లాలు సూర్యున్ని తాకాయి : మల్లికార్జున్ ​ఖర్గే

న్యూఢిల్లీ :  ప్రధాని నరేంద్ర మోదీ జుమ్లాలు సూర్యున్ని తాకాయని కాంగ్రెస్ ​పార్టీ చీఫ్ ​మల్లికార్జున్ ​ఖర్గే ఆరోపించారు. సోమవారం అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం మోదీ ప్రారంభించిన'ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన' స్కీమ్​పై ఆయన విమర్శలు గుప్పించారు. కోటి ఇండ్ల పైకప్పులపై సోలార్‌‌ సిస్టమ్స్‌‌ను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ​ఇస్తామని ప్రధాని చేసిన ప్రకటనపై ఖర్గే మంగళవారం మండిపడ్డారు.

 పదేండ్ల బీజేపీ పాలనలో 10 లక్షల ఇండ్లకు కూడా సోలార్​పవర్ ఇవ్వలేదని, ఇప్పుడు కోటి ఇండ్లకు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలోనూ మోదీ ప్రభుత్వం.. 2022 నాటికి రూఫ్‌‌టాప్ సోలార్ కెపాసిటీని 40 గిగావాట్లకు పెంచుతామని తప్పుడు వాగ్దానం చేసిందని, అది కేవలం 2.2 గిగావాట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కొన్ని ఇండ్లపై సోలార్​ సిస్టమ్​ ఏర్పాటు చేసినా.. స్థాపన సామర్థ్యంలో ఐదో వంతు మాత్రమే పవర్​జనరేట్​అవుతోందన్నారు. 

దీంతో మోదీ ప్రభుత్వం తన లక్ష్యాన్ని మార్చుకుందని, తాజాగా 2026 నాటికి టార్గెట్ పూర్తిచేస్తామని  ప్రకటించిందని ఆయన విమర్శించారు. మళ్లీ ఎలాంటి నిధులు కేటాయించకుండా ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సీజన్​ వస్తే.. బీజేపీకి జుమ్లా సీజన్​ వచ్చినట్టేనని ఖర్గే విమర్శించారు.