కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్​గా మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్​గా మల్లికార్జున ఖర్గే
  • శశిథరూర్ పై భారీ ఆధిక్యంతో  గెలుపు 
  • 24 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ 
  • ప్రెసిడెంట్ గా గాంధీ కుటుంబయేతర వ్యక్తి 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్​గా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. ప్రత్యర్థి శశిథరూర్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ కు 24 ఏండ్ల తర్వాత ప్రెసిడెంట్ అయిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా నిలిచారు. పార్టీ పగ్గాలు చేపట్టనున్న రెండో దళిత నేతగా, కర్నాటక నుంచి రెండో నేతగా కూడా ఖర్గే ఘనత సాధించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి సీనియర్ నేతలు ఖర్గే, థరూర్ పోటీ పడగా ఈ నెల 17న ఓటింగ్ జరిగింది. మొత్తం 9,385 మంది పార్టీ డెలిగేట్లు ఓటు వేశారు. ఎన్నిక ఫలితాలను బుధవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు. ఖర్గేకు7,897 ఓట్లురాగా, థరూర్​కు1,072 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. మరో 416 ఓట్లు చెల్లలేదన్నారు. గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరున్న ఖర్గేకు ఈ ఎన్నికలో మొత్తం 84% ఓట్లు వచ్చాయి. ఖర్గే ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఖర్గే సొంత రాష్ట్రమైన కర్నాటకలోని పీసీసీ ఆఫీసు వద్ద, ఇతర రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల వద్దా సందడి నెలకొంది. ప్రస్తుత పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ స్థానంలో ఖర్గే ఈ నెల 26న పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.

24 ఏండ్ల తర్వాత.. 

పార్టీకి 24 ఏండ్ల తర్వాత మళ్లీ గాంధీ కుటుంబేతర ప్రెసిడెంట్​గా ఖర్గే నిలిచారు. 1996లో సీతారాం కేసరి పార్టీ చీఫ్​​గా ఎన్నికయ్యారు. కర్నాటక నుంచి గతంలో నిజలింగప్ప కాంగ్రెస్ చీఫ్ కాగా, ఖర్గే రెండో వ్యక్తి. అలాగే జగ్జీవన్ రాం తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్​గా ఎన్నికైన రెండో దళిత నేతగా కూడా ఖర్గే నిలిచారు. 

ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు.. 

కాంగ్రెస్ పార్టీ 137 ఏండ్ల చరిత్రలో తాజాగా ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తొలిసారి1998లో అధ్యక్షురాలైన సోనియా..19 ఏండ్లు పదవిలో ఉన్నారు.  2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ 2019 వరకు కొనసాగారు. ఆ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయగా  మళ్లీ సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారు. 

సోనియా విషెస్

అధ్యక్ష ఫలితాలు రాగానే  ఢిల్లీలోని ఖర్గే ఇంటికి ప్రియాంకతో కలిసి వెళ్లిన సోనియా ఆయనకు విషెస్ చెప్పారు. ప్రధాని మోడీ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు.  కాంగతన పాత్ర ఏంటో ఆయనే డిసైడ్ చేస్తారని చెప్పారు.

యూనియన్ లీడర్ నుంచి పార్టీ చీఫ్​గా..

విద్యార్థి నాయకుడిగా, కార్మిక యూనియన్ లీడర్​గా మొదలైన మల్లికార్జున ఖర్గే (80) ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దాకా అంచెలంచెలుగా సాగింది. కర్నాటకలోని బీదర్ జిల్లా వరవట్టి గ్రామంలో 1942 జులై 21న దళిత నిరుపేద కుటుంబంలో ఖర్గే జన్మించారు. బీఏ, లా  చదివిన ఖర్గే కొంతకాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. విద్యార్థి దశ నుంచే లీడర్​గా పేరు తెచ్చుకున్నారు. 1969లో కాంగ్రెస్‌‌లో చేరిన ఆయన తొలిసారిగా1972లో గుర్మిట్కల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై వరుసగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.1976లో తొలిసారి మంత్రి అయ్యారు.  2005 నుంచి 2008 వరకు కర్నాటక పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టారు. మూడు సార్లు సీఎం అయ్యే చాన్స్ మిస్ అయినా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగానే కొనసాగారు. 2009లో గుల్బర్గా నుంచి ఎంపీగా గెలిచారు. మన్మోహన్ కేబినెట్ లో కేంద్రంలో కార్మిక శాఖ, రైల్వే శాఖ, న్యాయ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో లోక్ సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019లో తొలిసారిగా (గుల్బర్గా ఎంపీ సీటులో) ఓడిపోయారు. 2021, ఫిబ్రవరిలో ఆయనను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.  

పార్టీలో అంతా సమానమే

కాంగ్రెస్ పార్టీలో పెద్ద, చిన్న అనే తేడాలు లేవు. అంతా సమానమే. ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తే. అందరూ కలిసి పనిచేయాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ప్రమాదకరంగా మారిన ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా కలిసి పోరాడాలి. నేను నిజమైన కాంగ్రెస్ సైనికుడిలా పని చేస్తా. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. మతతత్వ ముసుగు తొడుక్కున్న విధ్వంసపూరిత శక్తుల్ని అంతం చేయాలి. 

కాంగ్రెస్ స్ట్రాంగ్ అయింది: థరూర్ 

కాంగ్రెస్ లో తాను ఎన్నడూ అసమ్మతివాదిని కాదని, కానీ పార్టీలో మార్పును మాత్రమే కోరుకున్నానని థరూర్ అన్నారు. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక ఫలితాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికతో పార్టీకి కొత్త ఎనర్జీ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమైందన్నారు. ‘‘ఇది వ్యక్తిగతమైన విషయం కాదు. పార్టీ బలోపేతం కావాలనే నేను కోరుకున్నాను. బలమైన ఇండియా కోసం బలమైన కాంగ్రెస్ కావాలి” అని అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖర్గే సమర్థంగా అమలు చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని శశిథరూర్ ఆరోపించారు.