సోనియా నుంచి పార్టీ బాధ్యతలు అందుకున్న ఖర్గే

సోనియా నుంచి పార్టీ బాధ్యతలు అందుకున్న ఖర్గే
  • కాంగ్రెస్ కేడర్​కు కొత్త ప్రెసిడెంట్ పిలుపు
  • అబద్ధాల, ద్వేషపూరిత వ్యవస్థను బద్దలుకొడ్దాం..
  • కేంద్రం నిద్రపోతోందని.. ఈడీ, సీబీఐ మాత్రం పనిచేస్తున్నాయని కామెంట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కార్యకర్తలు భయపడొద్దు(డరో మత్) అని, దేశంలో ప్రస్తుతం నెలకొన్న ‘అబద్ధాలు, ద్వేష, ద్రోహపూరిత వ్యవస్థ’ను కలిసికట్టుగా బద్దలుకొడదామని ఆ పార్టీ కొత్త ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్​లో కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఒక కార్మికుడి కొడుకును, సాధారణ కార్యకర్తను అయిన నన్ను పార్టీ ప్రెసిడెంట్​గా ఎన్నుకున్న కాంగ్రెస్ వాదులందరికీ థ్యాంక్స్ చెప్తున్నా” అని తెలిపారు. ‘భయపడొద్దు’ అంటూ గతంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటనే నినాదంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఇది క్లిష్ట సమయం అని నాకు తెలుసు. దేశంలో యువతకు ఉద్యోగాల్లేవు. రైతులను జీపులతో తొక్కిస్తున్నరు. మహిళలపై అత్యాచారాలు 
పెరుగుతున్నాయి. అధిక ధరలతో జనం అల్లాడుతున్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం కండ్లు మూసుకున్నది. కొంతమంది కార్పొరేట్ మిత్రులకు మాత్రమే హెల్ప్ చేస్తున్నది” అని ఖర్గే మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోంది. కానీ ఈడీ, సీబీఐ మాత్రం అణచివేతల కోసం 24 గంటలూ పని చేస్తున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి” అని ఆయన ఆరోపించారు. 

50 ఏండ్లలోపు వాళ్లకు 50% పదవులు

ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం.. పార్టీలో 50 ఏండ్లలోపు వాళ్లకు 50 శాతం పదవులు ఇస్తామని, సంస్థాగత ఖాళీలను భర్తీ చేస్తామని, పార్టీలో కొత్తగా పబ్లిక్ ఇన్ సైట్, ఎలక్షన్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్లను ఏర్పాటు చేస్తామని ఖర్గే వెల్లడించారు. రాష్ట్రాల్లో రాజకీయ వ్యవహారాల కమిటీలను కూడా నియమిస్తామన్నారు. భారత్ జోడో యాత్ర దేశానికి కొత్త శక్తిని ఇస్తోందన్నారు. త్వరలోనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం కార్యకర్తలు శాయశక్తులా పని చేయాలన్నారు. ముందుగా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ పార్టీ ప్రెసిడెంట్​గా ఖర్గే ఎన్నికైనట్లు సర్టిఫికెట్ ను అందజేశారు. అనంతరం పార్టీ ప్రెసిడెంట్ ఆఫీసులో ఖర్గేకు పార్టీ బాధ్యతలను సోనియా అప్పగించారు. అంతకుముందు మహాత్మా గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, బాబూ జగ్జీవన్ రామ్​ల సమాధులను సందర్శించిన ఖర్గే వారికి నివాళులు అర్పించారు. 

47 మందితో స్టీరింగ్ కమిటీ 

కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ స్థానంలో కొత్తగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని ఖర్గే నియమించారు. స్టీరింగ్ కమిటీలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా 47 మంది సీనియర్ నేతలకు చోటు కల్పించారు. సంప్రదాయం ప్రకారం.. పార్టీ కొత్త ప్రెసిడెంట్​గా ఖర్గే బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జులు రాజీనామా చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఖర్గే.. స్టీరింగ్ కమిటీని నియమించారని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 

భారాన్ని దింపుకున్నా

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే పార్టీ కేడర్ కు స్ఫూర్తిగా నిలుస్తారని ఆ పార్టీ మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ అన్నారు. ‘‘మార్పు అనేది ప్రపంచ నియమం. ఇయ్యాల పార్టీ బాధ్యతలను ఖర్గేకు అప్పగిస్తూ నాపై ఉన్న భారాన్ని దింపుకొన్నా. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న పూర్తి నమ్మకం ఉంది. పార్టీ ముందున్న సవాళ్లను ఆయన విజయవంతంగా ఎదుర్కొంటారని ఆశిస్తున్నా” అని సోనియా తెలిపారు.