గ్రూప్స్​ మాత్రమే కాదు.. సింగరేణి పరీక్షల్లోనూ అక్రమాలు : మల్లు భట్టి విక్రమార్క

గ్రూప్స్​ మాత్రమే కాదు.. సింగరేణి పరీక్షల్లోనూ అక్రమాలు : మల్లు భట్టి విక్రమార్క

మంచిర్యాల, వెలుగు : సీఎం కేసీఆర్ ​ఓ వైపు తెలంగాణలోని ఆస్తులను అమ్ముతూ మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్​కు టెండర్ వేయడం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ లీడర్​ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి గనులను ప్రైవేటీకరిస్తూ తనకు కావాల్సిన వ్యక్తులకు కేటాయిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తన కుటుంబసభ్యులకు ధారాదత్తం చేస్తున్నాడన్నారు. కేసీఆర్​ మళ్లా గెలిస్తే తెలంగాణను అమ్మకానికి పెడుతాడన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ప్రగతి స్టేడియంలోని పాదయాత్ర శిబిరం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అంతకుముందు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. భట్టి మాట్లాడుతూ టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకులే కాదని, సింగరేణి రిక్రూట్​మెంట్​పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. మిషన్ భగీరథ కోసం రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క గ్రామానికీ నీళ్లు రావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు సైతం సాగునీరందించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.

కాళేశ్వరం ముంపు భూములను సేకరించి 2013 యాక్ట్ ప్రకారం రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ఈ నెల14న మంచిర్యాలలో నిర్వహించే జై భారత్ సత్యాగ్రహ దీక్ష బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, స్పోక్స్ పర్సన్స్ లోకేష్ యాదవ్ పాల్గొన్నారు.