పశ్చిమాసియాపై చర్చకు కేంద్రం ఒప్పుకోవట్లే..విదేశాంగ శాఖ అమెరికాకు లొంగిపోయింది: ఎంపీ మల్లు రవి

పశ్చిమాసియాపై చర్చకు కేంద్రం ఒప్పుకోవట్లే..విదేశాంగ శాఖ అమెరికాకు లొంగిపోయింది: ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించకుండా పార్లమెంట్‌‌కు బీజేపీ తాళం వేసిందని, మన విదేశాంగ శాఖ డొనాల్డ్‌‌ ట్రంప్‌‌కు లొంగిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి విమర్శించారు. భారత విదేశాంగ విధానం వల్ల దేశ ఆర్థిక స్థిరత్వం, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఇండియన్ల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆయా దేశాల్లో మారుతున్న పరిస్థితులపై పార్లమెంట్‌‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఈ యుద్ధ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా విదేశాంగ మంత్రి ప్రకటనతో సరిపెట్టడం సరైంది కాదన్నారు. “ప్రపంచంలో ఇంత పెద్ద సంక్షోభం జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌‌లో చర్చ జరగాల్సింది. కానీ బీజేపీ ప్రభుత్వం చర్చను తప్పించుకుంటూ సభను నడవనివ్వడం లేదు. మోదీ ప్రభుత్వం వైఖరి కారణంగా వల్ల దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పక్కనబెట్టి అమెరికా విధానాలకు లొంగిపోతున్నట్టుగా కనిపిస్తోంది”అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌‌ను ప్రతిపక్షం అడ్డుకోవడం లేదని, దేశానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగాలని కోరుతున్నామన్నారు. కేంద్రం చర్చకు నిరాకరించడంతోనే ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడుతున్నాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులు, విదేశాంగ విధానంపై పార్లమెంట్‌‌లో చర్చ జరిపేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.