
న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ నియంతలా మాట్లాడుతున్నారని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి మండిపడ్డారు. ‘‘రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న సీఎం రేవంత్‌ను కేటీఆర్ అవమానిస్తూ.. అప్రజాస్వామికమైన కామెంట్లు చేస్తున్నడు. ఆయన వ్యాఖ్యలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి” అని అన్నారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్, పీసీసీ జనరల్ సెక్రటరీలు చరణ్ కౌశిక్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులతో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే ప్రగతిభవన్ గేట్లు బద్ధలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛా, స్వాంతంత్ర్యం కల్పించారని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని, అలాంటి వ్యక్తి ఎవరి కాలిగోటికి సరిపోడో కేటీఆర్ చెప్పాలని ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష పార్టీ నేతగా నిర్మాణాత్మకంగా సలహాలు ఇస్తే తీసుకుంటాం. అంతేకానీ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. చేసే ప్రతి విమర్శకు జస్టిఫికేషన్ ఉండాలి. ఇష్టారీతిగా కేటీఆర్ మాట్లాడటం సరికాదు” అని హెచ్చరించారు. కాగా, తాను లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటానని, రాజ్యసభకు వెళ్లాలనే యోచన లేదని ఆయన అన్నారు.
ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌లోపు భవన్ విభజన!
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజన పూర్తవుతుందని మల్లు రవి అన్నారు. భవన్ విభజన అంశానికి సంబంధించి సోమవారం కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీతో భేటీ అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించామన్నారు.
భవన్ ఆస్తుల విభజన విషయంలో ఇరు రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నందున త్వరితగతిన విభజన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరినట్లు వివరించారు. దీనిపై హోం శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఆ నోటిఫికేషన్ రాగానే... సీఎం, మంత్రులు చర్చించి తెలంగాణ భవన్ బిల్డింగ్ డిజైన్ పై నిర్ణయం తీసుకుంటారని మల్లు రవి అన్నారు.