- ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలతో కోర్టును ఆశ్రయించేందుకు మమత నిర్ణయం
- సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడి
- కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
- తిరిగి నల్లకోటు ధరించనున్న దీదీ, చంద్రమ భట్టాచార్య
- ఈ నెల 9న టీఎంసీ కార్యాలయాల్లో రవీంద్ర సంగీతం పేరుతో నిరసన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. బుధవారం కాళీఘాట్‌లోని మమత నివాసంలో నూతనంగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో జరిగిన హై-ప్రొఫైల్ సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలతో ఘనవిజయం సాధించడంపై మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం అండతో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, బలవంతంగా లాక్కున్న తీర్పు అని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సాధించిన ఈ విజయాన్ని మేం అంగీకరించం. దీనిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం” అని పేర్కొన్నారు.
తిరిగి న్యాయవాద వృత్తిలోకి..
న్యాయ పోరాటాన్ని స్వయంగా నడిపించేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. తాను, మాజీ మంత్రి చంద్రమ భట్టాచార్య కోర్టుల్లో తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభిస్తామని ఆమె ప్రకటించారు. నల్లకోటు ధరించి.. ఎన్నికల అక్రమాలపై కోర్టులో వాదిస్తామని వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఓటమి తర్వాత ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం ఆనవాయితీ కాగా.. మమత అందుకు నిరాకరించారు. తన రాజీనామా లేఖను సమర్పించబోనని, పదవిలో కొనసాగడమే ఒక నిరసన అని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే ‘రాష్ట్రపతి పాలన’ విధించుకోవచ్చని, దానికి తాము సిద్ధమని మమత సవాల్ విసిరారు. దీనికి మద్దతుగా ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. పార్టీ నాయకులెవరూ తమ పదవులకు రాజీనామా చేయకూడదని, పదవుల్లో ఉంటూనే అక్రమ తీర్పుపై పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు.
మే 9న వినూత్న నిరసన
కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే మే 9వ తేదీన టీఎంసీ కార్యాలయాలన్నింటిలో రవీంద్ర సంగీతాన్ని (రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాలు) ఆలపించాలని పార్టీ శ్రేణులకు మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గెలిచిన ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లోనే ఉండి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, జాతీయ రాజకీయాల్లో తన పాత్ర తగ్గేది లేదని మమత స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా ‘ఇండియా కూటమి’ని బలోపేతం చేసేందుకు, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని పేర్కొన్నారు.
