విశ్లేషణ: కాంగ్రెస్​కు చెక్​ పెట్టేలా మమత ప్లాన్స్?

విశ్లేషణ: కాంగ్రెస్​కు చెక్​ పెట్టేలా మమత ప్లాన్స్?

ఒకవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. మరోవైపు వచ్చే ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్​ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఢిల్లీ పొలిటికల్​ హీట్​ పెరిగింది. పశ్చిమబెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్​కు వెలుపల తన పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్న మమత నేషనల్​ లెవెల్​లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వరుసగా టూర్లు వేస్తున్నారు. తాజాగా ముంబై వెళ్లి ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు కూడా హాట్​ టాపిక్​గా మారాయి. యూపీఏ అనేది ఇప్పుడు లేదని చెప్పిన మమత.. కాంగ్రెస్​ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై పావులు కదుపుతున్నారు. దానికి నాయకత్వ వహించడం ద్వారా రాహుల్​గాంధీకి చెక్​ పెట్టి ప్రధాని అభ్యర్థి కావాలని భావిస్తున్నారు. 

వందేండ్ల క్రితం మన దేశంలో రెండు లక్షలకుపైగా పులులు ఉండేవి. ఇప్పుడు కేవలం మూడు వేల పులులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ బెంగాల్‌‌ టైగర్స్​ అంటే ప్రపంచ ప్రసిద్ధి. దేశ రాజకీయాల్లో పులి లాంటి నాయకులు కొందరే మిగిలారు. అందులో మమతాబెనర్జీ ఒకరు. అందుకే ఆమెను బెంగాల్​ బెబ్బులి అంటూ పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో మమతాబెనర్జీ ఒక వెలుగు రేఖ. ఆమె నిజాయితీ గల, కులాలకు అతీతమైన, ఉదారవాద, పోరాట యోధురాలు, విజేత. మమత 1984లో తొలిసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌‌ సీఎంగా మూడో టర్మ్​ కొనసాగుతున్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీలా వారసత్వంతో ఎంజీఆర్‌‌‌‌ వారసురాలు జయలలితలా ఆమె రాజకీయాల్లోకి రాలేదు. చాలా కష్టాలను ఎదుర్కొని పైకిఎదిగారు.

మహిళా లీడర్లకు అవకాశాలు
ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత గొప్ప మహిళా నాయకులే. కానీ, వీరిలో ఎవరూ కూడా టాలెంట్‌‌ ఉండి, ప్రజలను ఆకర్షించగలిగే సత్తా కలిగిన మహిళా నాయకులను ప్రోత్సహించలేదు. మహిళల కోసం పథకాలు, మహిళా రిజర్వేషన్ల గురించి వారంతా గొప్పగా మాట్లాడారు కానీ, వాస్తవానికి మహిళా లీడర్లను వారంతా చాలా నిరుత్సాహపరిచారు. ఈ మహిళా లీడర్లు ప్రోత్సహించిన ఒక్క సెలబ్రిటీ లీడర్‌‌‌‌ కాని, టాలెంట్‌‌ ఉన్న మహిళా నాయకులు కానీ మనకు మచ్చుకైనా కనిపించరు. కానీ వీరందరికీ పూర్తి వ్యతిరేకం మమతా బెనర్జీ. తాను ఎదగడమే కాదు.. తనతో పాటు మరింత మహిళా లీడర్లను ఆమె పైకి తెచ్చారు.

సీనియర్లకు.. సెలబ్రిటీలకు స్థానం
2011 నుంచి ఎందరో ప్రతిభావంతులైన మహిళలను, చాలామంది మహిళా సెలబ్రిటీలను, మేధావులను రాజకీయాలకు పరిచయం చేశారు మమతా బెనర్జీ. వారికి మంచి పదవులను అప్పగించారు. మమత చాలా కఠినమైన జీవితాన్ని గడుపుతారు. ఎవరికీ అదరకుండా, బెదరకుండా ముందుకు సాగిపోతారు. సెలబ్రిటీల ముందు తాను చిన్నగా కనిపిస్తాననే భయం ఆమెకు లేదు. అదే మమతా బెనర్జీలో ఉన్న గొప్ప సుగుణం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన పార్టీలో చేరమని సీనియర్‌‌‌‌ నాయకులను, మేధావులను ఆమె ఎంతో ప్రోత్సహించారు. అందువల్లే ప్రస్తుతం దేశంలో ఉన్న ఉత్తమ శాసనసభ్యులు, పార్లమెంట్‌‌ సభ్యులు ఎక్కువ మంది మమత పార్టీ నుంచే ఉన్నారు. 45 ఏండ్ల క్రితం ఎంపీగా గెలిచిన వారు ఆమె పార్టీలో ఉన్నారు. అలాగే నుస్రత్‌‌ జహాన్‌‌ వంటి ఆవేశపూరిత నటీమణులు కూడా ఎంపీలుగా ఉన్నారు. ఈ రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీలు కానీ ఇటువంటి సెలబ్రిటీలు, మేధావులు, సీనియర్‌‌‌‌ లీడర్లను అంగీకరించడం లేదు. సాధారణంగా పార్టీల అధినేతలు పేరుప్రఖ్యాతులు లేని వ్యాపారవేత్తలు లేదా సామాన్యులనే ప్రోత్సహిస్తారు. కానీ వారంతా ప్రజలచే తిరస్కరించబడతారు. ములాయం సింగ్‌‌ యాదవ్‌‌, శరద్‌‌ పవార్‌‌‌‌ వంటి కొందరే దీనికి మినహాయింపు. వారు కూడా మమతలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే యాభై ఏండ్ల నుంచి వారు 
రాజకీయాల్లో మనగలుగుతున్నారు.

కాంగ్రెస్‌‌ను దెబ్బ తీయాలని..
ప్రతిపక్షాలను ఏకం చేసి సరికొత్త లీడర్‌‌గా అవతరిస్తే 2024లో బీజేపీపై విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారు. మమతతో పాటు చాలా అపోజిషన్​ పార్టీల నేతలు రాహుల్‌‌ గాంధీను తమ నాయకుడిగా ఒప్పుకోవడంలేదు. ప్రతిపక్షాలు 2024లో బీజేపీని ఓడించాలని అనుకుంటే ప్రతిపక్ష నాయకత్వానికి మమతే కీలక నాయకురాలు అవుతారు. కేసీఆర్(టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌), అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌(ఆప్), నవీన్‌‌ పట్నాయక్‌‌(బీజేడీ) వంటి చాలా పార్టీల నాయకులు బీజేపీ, కాంగ్రెస్‌‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో వారందరూ మమతను మాత్రం అంగీకరిస్తున్నారు. ఎన్‌‌సీపీ(శరద్‌‌ పవార్‌‌‌‌), శివసేన(థాక్రే)కి కూడా మమత అంటే ఆమోదయోగ్యమే. గోవా, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్, తెలంగాణలో మమత అడుగుపెట్ట నుండగా త్రిపుర, మేఘాలయల్లో ప్రధాన ప్రతిపక్షంగా టీఎంసీ ఉంది. కాంగ్రెస్‌‌ పార్టీలోని కొంతమంది నాయకులను మమత ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్‌‌ను దెబ్బతీయాలంటే ప్రతి చోట ఎన్నికల్లో పోటీ చేసి, ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతేనే అది సాధ్యమవుతుందనేది ఆమె ఉద్దేశం.

అందరికీ పరీక్షా సమయమే
2022 ఫిబ్రవరిలో చాలా రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోడీకి, ఇతర నాయకులకు అది పరీక్షా సమయం. లోక్​సభ ఎన్నికలకు దీనిని సెమీ ఫైనల్​గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్​ వంటి కీలక రాష్ట్రాలు ఎన్నికలకు దగ్గరగా ఉండటమే దీనికి కారణం. అయితే బీజేపీకి తన తప్పులను సవరించుకోడానికి ఇంకా చాలా సమయం ఉంది. భవిష్యత్‌‌ ఎవరి ఊహకు అందదు కనుక, మమత ఎటువంటి తప్పిదాలు చేయలేరని ఎవరూ చెప్పలేరు. ఆమె వైపు నుంచి కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇతర ప్రతిపక్ష నాయకులతో పోలిస్తే ఆమె బలహీనతలు తక్కువ. కాంగ్రెస్​కు ఎదురవుతున్న ప్రమాదం ఏమిటంటే మమతను రాహుల్  అనుకోని పరిస్థితుల్లో శత్రువును చేసుకుంటున్నారు. ‘మన శత్రువును ఎంచుకోవడంలో మరీ జాగ్రత్తగా ఉండరాదు’ అని సుప్రసిద్ధ ఇంగ్లిష్​ రైటర్​ ఆస్కార్‌‌ వైల్డ్ వందేండ్ల క్రితమే చెప్పారు. మమత అత్యంత ప్రమాదకర శత్రువు. బెంగాల్‌‌ను దశాబ్దాల కాలం పాలించి మమత  చేతిలో ఓటమిపాలైన కమ్యూనిస్టులను అడిగితే వాళ్లే చెబుతారు ఆమె ఎంత ప్రమాదకారో.

మమత చేతిలో కాంగ్రెస్​కు అవమానాలు
సాధారణంగా పార్లమెంట్‌‌ సమావేశాలకు ముందు ప్రతిపక్షాలన్నీ సమావేశం అవుతుంటాయి. కానీ ఈ సారి శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌‌ మమతను ఆహ్వానిస్తే, దానికి హాజరు కావడానికి ఆమె ఇష్టపడలేదు. ప్రతిపక్షాలు కాళ్లావేళ్లా పడితే గానీ పార్లమెంట్‌‌లో సహకరించడానికి ఆమె ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌‌ పార్టీ తన హద్దుల్లో ఉండాలని, కాంగ్రెస్‌‌ తమకు పెద్దన్న కాదని ఆమె తేల్చి చెప్పారు. అయినా ఈ అవమానాలను కాంగ్రెస్​ భరించాల్సి వచ్చింది. నవంబర్‌‌‌‌ 25న మమత ఢిల్లీలో ఉన్నప్పుడు, సోనియాను కలుస్తారా? అని మీడియా అడిగితే, ‘నేను ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఆమెను కలవడానికి సోనియా ఏమైనా రాజ్యాంగ అధిపతా’ అని కోపంగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ నాయకులను తన పార్టీలో చేర్చుకుని, మమత కాంగ్రెస్‌‌ను బహిరంగంగా అవమానిస్తున్నా, ఆమెపై రాజకీయ దాడి చేయడానికి కాంగ్రెస్‌‌ జంకుతోంది. మమతపై దాడి చేస్తే గాంధీలకు ఎదురుదెబ్బ తప్పదని కాంగ్రెస్‌‌ పార్టీకి బాగా తెలుసు.

గాంధీలను వ్యతిరేకించడానికి కారణాలు
ప్రతిపక్ష నాయకత్వ స్థానం నుంచి గాంధీలను తప్పించాలని మమత తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. 2014, 2019లో రెండుసార్లు వారికి అవకాశం ఇచ్చినా ఘోరంగా విఫలమయ్యారని మమత చెబుతున్నారు. అయితే ఆమె వాదనను గాంధీలు తిరస్కరిస్తున్నారు. దీని గురించి జులై 28న ఢిల్లీలో మమతాబెనర్జీ, గాంధీల మధ్య పెద్ద సమావేశమే జరిగింది. మమత జాతీయ స్థాయి నాయకురాలు అవుతుందేమోనని కాంగ్రెస్‌‌ ఇప్పటికీ లోలోపల రగిలిపోతోంది. బీజేపీపై పోరాడటానికి ప్రతిపక్ష ఫ్రంట్‌‌లో కాంగ్రెస్‌‌ భాగం కావాలి కానీ, ఫ్రంట్‌‌కు నాయకత్వం వహించకూడదని మమత బాహాటంగానే చెబుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ ప్రధాన సలహాదారు అయిన ప్రశాంత్‌‌ కిశోర్​ ఆమెను జాతీయ నాయకురాలిగా తీర్చిదిద్దే ప్లాన్‌‌ను అమలు చేస్తున్నారు. ఇది సహజంగానే గాంధీల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.

పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్