
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పెర్త్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో అతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన ఈ మ్యాచులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇండియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొలేక వెనువెంటనే పెవిలియన్ చేరారు.
రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ అయితే.. కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేశాడు. ఈ క్రమంలో రోకో జోడీ ప్లాఫ్ షోపై టీమిండియా మాజీ బౌలర్ వరుణ్ ఆరోన్ హాట్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్లే కోహ్లీ, రోహిత్ విఫలమయ్యారని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న వీరిద్దరూ ఆటతో టచ్‌లో ఉండటానికి దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు.
2014లో టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత దిగ్గజ క్రికెటర్ ధోని దేశీయ క్రికెట్ ఆడాడని వరుణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోహ్లీ, రోహిత్ కూడా ధోని మాదిరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచన చేశారు. గేమ్‌తో టచ్‌లో ఉండటానికి ఇదొక గొప్ప మార్గమని అన్నారు. కోహ్లీ, రోహిత్ తన సూచన పరిశీలిస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ, రోహిత్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న నేపథ్యంలో వాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ చాలా అవసరమన్నారు.