SA vs IND: క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్: ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్.. టికెట్ ధర రూ.60

SA vs IND: క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్: ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్.. టికెట్ ధర రూ.60

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వచ్చే నెలలో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కు ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం సోమవారం (అక్టోబర్ 20) మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం ప్రకటించింది. టికెట్ ధర కేవలం రూ. 60 మాత్రమే కావడం విశేషం. స్టార్టింగ్ ధర రూ. 60 నుంచి ప్రారంభమవవుతుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ను రూ.300తో చూడవచ్చు. అత్యధికంగా టికెట్ ధర రూ. 250 వరకు ఉంటుంది. 

అభిమానులు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 14 నుంచి 18 వరకు ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లో భాగంగా సఫారీలతో టీమిండియా తొలి టెస్టులో తలపడుతుంది. 2019లో ఇండియా- బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈడెన్‌లో జరగబోయే తొలి టెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది.

నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్  న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే.. టీ20 సిరీస్ లు జరుగుతాయి. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే చివరి సిరీస్ ఇదే. 

మూడో స్థానంలోనే ఇండియా: 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా మూడో స్థానంలోనే ఉంది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. తాజాగా వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసినా మూడో స్థానంలోనే కొనసాగుతుంది. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. పాయింట్ల శాతాన్ని పెంచుకోగలిగినప్పటికీ టాప్-2 లోకి రాలేకపోయింది.   

ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో ఏడు టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 52 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. స్వదేశంలో నవంబర్ నెలల్లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఇండియా గెలిస్తే టాప్-2 కు చేరుతుంది. తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై యాషెస్ లో ఓడిపోతే ఇండియా టాప్ కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది.