Womens World Cup 2025: ఇంగ్లాండ్‎పై పోరాడి ఓడిన భారత్.. గెలవాల్సిన మ్యాచులో చేజేతులా ఓటమి

Womens World Cup 2025: ఇంగ్లాండ్‎పై పోరాడి ఓడిన భారత్.. గెలవాల్సిన మ్యాచులో చేజేతులా ఓటమి

ఉమెన్స్ వన్డే వరల్డ్‎ కప్‎లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (70), ఓపెనర్ స్మృతి మందాన (88) రాణించడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచులో లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆరంభంలో తేలిపోయిన ఇంగ్లాండ్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. తాజా ఓటమితో వన్డే వరల్డ్ కప్‎లో టీమిండియా వరుసగా మూడో మ్యాచులో ఓడి సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 

ఆదివారం (అక్టోబర్ 19) ఇండోర్‎లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హీథర్ నైట్ (109) సెంచరీతో కదం తొక్కగా.. ఓపెనర్ అమీ జోన్స్ (56) హాఫ్ సెంచరీతో రాణించింది. నాట్ స్కైవర్-బ్రంట్ (38), టామీ బ్యూమాంట్ (22) ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 288 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లతో చెలరేగగా.. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. 

అనంతరం 289 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన ఇండియా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రతీకా రావల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యింది. ప్రతీకా ఔటైన మరో ఓపెనర్ స్మృతి మందాన దూకుడుగా ఆడింది. హర్లీన్ డియోల్‎తో కలిసి ఇన్సింగ్స్‎ను ముందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో 24 పరుగులు చేసిన హార్లిన్ డియోల్ చార్లీ డీన్‎కు ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్లు ముందు దొరికిపోయింది.

 అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందనాతో కలిసి జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో ఇండియా సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ (70) చేసిన హార్మన్ వేగంగా ఆడే క్రమంలో స్కీవర్ బ్రంట్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయింది. ఈ దశలో జతకట్టిన దీప్తి శర్మ, స్మృతి కలిసి ఇండియాను విజయం దిశగా నడిపించారు. సెంచరీకి చేరువలో ఉన్న స్మృతి (88) అనుహ్యంగా ఔట్ అయ్యింది. 

కొద్దిసేపటికే దీప్తి శర్మ (50) కూడా పెవిలియన్  చేరడంతో సునాయసంగా గెలివాల్సిన మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. ఆరంభంలో తేలిపోయిన ఇంగ్లాండ్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసి 4 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్కీవర్ బ్రంట్ 2 వికెట్లు తీయగా.. బెల్, స్మిత్, డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ పడగొట్టారు. తాజా ఓటమితో వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన టీమిండియా వన్డే వరల్డ్ కప్‎లో సెమీస్ ఆశలను క్లిష్టం చేసుకుంది.