- అక్టోబరు 6న బిడ్లు ప్రారంభం.. చివరి తేదీ నవంబర్ 3
న్యూఢిల్లీ, వెలుగు: మామునూర్ (వరంగల్) ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) టెండర్లకు ఆహ్వానం పలికింది. మొత్తం రూ.213.59 కోట్ల (జీఎస్టీ మినహాయించి) అంచనా వ్యయంతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద వసతులతో కూడిన డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్, ఫైర్ స్టేషన్ ఇతర అనుబంధ పనులను చేపట్టనున్నారు.
మొత్తం అంచనా వ్యయం రూ.213.59 కోట్లలో నిర్మాణ వ్యయం రూ.178.07 కోట్లు కాగా.. 10 ఏండ్ల నిర్వహణ, రిపేర్ల వ్యయం రూ.35.52 కోట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నిర్మాణ పనులకు 18 నెలల కాలపరిమితిని నిర్దేశించారు. బిడ్ల దాఖలు ప్రారంభం అక్టోబరు 6 కాగా.. చివరి తేదీ నవంబర్ 3గా నిర్ణయించారు. నవంబర్ 9 న బిడ్లను తెరవనున్నారు. 2028 జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినం నాటికి ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ దిశలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో సీఎం పలు మార్లు భేటీ అయి.. ప్రాజెక్ట్కున్న అన్ని అడ్డంకులను క్లియర్ చేశారు.
