కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నం..డబ్బులు పంపండి      

కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నం..డబ్బులు పంపండి      
  • మ్యాట్రిమోని సైట్ లో ఫేక్ ప్రొఫైల్ తో ట్రాప్
  • యువతి నుంచి రూ.5లక్షలు కాజేసిన నిందితుడు
  • రాచకొండ సైబర్ క్రైమ్ కు బాధితురాలి ఫిర్యాదు
  • మరో  కేసులో నైజీరియన్ ను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు

ఎల్ బీ నగర్,వెలుగు : మ్యాట్రిమోని సైట్ లో ఫేక్ ప్రొఫైల్ తో ఓ యువతిని మోసం చేసి.. ఆమె దగ్గరి నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన ఓ యువతి(31) ప్రైవేటు జాబ్ చేస్తోంది. పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్ లో ఫ్రొఫైల్ క్రియేట్ చేసి తన వివరాలు పెట్టింది. దీన్ని చూసిన సైబర్ మోసగాడు.. ప్రేమ్ అక్షయ్ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను యూకేలో బిజినెస్ మేన్ అని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో కొన్ని రోజులు చాట్ చేశాడు. ప్రేమ్ అక్షయ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ఆమె నమ్మింది. దీన్ని అదునుగా భావించిన ఆ మోసగాడు తాను యూకే నుంచి రూ.లక్షలు విలువ చేసే గిఫ్ట్ కొరియర్ పంపిస్తున్నాని చెప్పాడు. రెండు రోజుల తర్వాత ఓ ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ యువతి పేరు మీద గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని.. అందులో గోల్డ్ ఉందని..దాన్ని అధికారులు పట్టుకున్నట్టు ఫోన్ లో చెప్పారు. అదే సమయంలో ఆ మోసగాడు కూడా యువతికి ఫోన్ చేసి గిఫ్ట్ ప్యాక్ ను రిలీజ్ చేయాలంటే .రూ.5లక్షలు వారికి ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆ యువతి రూ.5లక్షలను కస్టమ్స్ పేరుతో ఫోన్ చేసిన వారి అకౌంట్ లోకి డిపాజిట్ చేసింది. ఆ తర్వాత ఎన్ని రోజులైనా గిఫ్ట్ ప్యాక్ రాకపోవడంతో తాను మోసపోయినట్లు ఆ యువతి గ్రహించింది.

డబ్బులు తిరిగిచ్చేస్తామని చెప్పి మళ్లీ మోసం

మోసపోయిన ఆ యువతి కొన్ని రోజుల పాటు ప్రేమ్ అక్షయ్ గా చెప్పుకుంటున్న ఆ మోసగాడికి ఫోన్ చేస్తూనే ఉంది. ఓ సారి ఫోన్ కలవడంతో యువతి అతడిని నిలదీసింది. దీంతో ఆ మోసగాడు నీ డబ్బులు నీకు ట్రాన్స్ ఫర్ చేస్తానని ఇందుకోసం  8 అకౌంట్ లు ఓపెన్ చేసి ఏటీఎం, పిన్ నంబర్, పాస్ బుక్ సహా అన్నీ ఢిల్లీకి పంపమని ఓ అడ్రస్ ఇచ్చాడు. ఆ దుండగుడి మాటలు మరోసారి నమ్మిన యువతి అతడు చెప్పినట్లుగా చేసింది.కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి కర్ణాటక పోలీసులు వచ్చి.. ఆ యువతి ఇచ్చిన బ్యాంకు డీటెయిల్స్ ఆధారంగా ఆ మోసగాడు ఇదే తరహాలో మరికొంత మందిని మోసం చేసేందుకు ఆ అకౌంట్లను ఉపయోగిస్తున్నాడని చెప్పారు. దీంతో  ఆ యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సదరు యువతి ఇచ్చిన అకౌంట్స్ ఆధారంగా నిందితుడు చాలా మందిని మోసం చేసినట్లు కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. ఇది నైజీరియన్ ముఠా పనే అని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు.

మరో కేసులో..

మాట్రిమోని లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి  పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను మోసం చేస్తున్న ఓ నైజీరియన్ ని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్ కథనం ప్రకారం… నైజీరియాకి చెందిన ఒనైనార్ ఆలివ్నెఎమ్ బ్రైట్ (32) ఢిల్లీలో ఉంటున్నాడు. ఒనైనార్ జీవన్ సాతి.కామ్ అనే మాట్రిమోని సైట్ లో బాసిస్ కరిమ్ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తాను యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన వాడినని ప్రొఫైల్ లో రాసుకున్నాడు. సిటీకి చెందిన ఓ యువతి(30) ప్రొఫైల్ ను చూసిన ఒనైనార్ ఆమెతో పరిచయం పెంచుకుని   పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత ఇండియాకు వస్తున్నాని చెప్పాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తన యూకే పౌండ్స్, విలువైన గిఫ్ట్ లను సీజ్ చేశారని..వాటికి క్లియరెన్స్ రావాలంటే 32,500 డబ్బు డిపాజిట్ చేయాలని ఫోన్ లో ఒనైనార్ ఆ యువతికి చెప్పాడు. దీన్ని నమ్మిన ఆ యువతి ఒనైనార్ చెప్పిన బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బును డిపాజిట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ వేరే ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి మరికొంత డబ్బు అకౌంట్ లో వేయాలని ఒనైనార్ చెప్పాడు. మోసపోయినట్లు గ్రహించని ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు..ఫోన్ కాల్స్, బ్యాంక్ వివరాల ఆధారంగా మోసానికి పాల్పడిన వ్యక్తిని నైజీరియాకు చెందిన ఒనైనార్ గా గుర్తించారు. ఒనైనార్ 2014లో మెడికల్ వీసాపై ఢిల్లీకి వచ్చాడన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఒనైనార్ ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా..ఎంతో మంది అమ్మాయిలను ఈ ఫేక్ ప్రొఫైల్ తో మోసం చేశాడని తేలిందని పోలీసులు వెల్లడించారు.