మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కాంగ్రెస్ డిమాండ్

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసేలోపు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తోన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్‎ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. 

నామినేషన్ అఫిడవిట్‎లో ఓ క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేయగా.. ఈసీ ఆమె నామినేషన్‎ను రిజెక్ట్ చేసింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశంపై చర్చించేందుకు బుధవారం (జూన్ 10) న్యూఢిల్లీలో ఈసీ ప్రతినిధులతో కాంగ్రెస్ డెలిగేషన్ సమావేశమైంది. సీనియర్ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. 

ఎన్నికల చట్టం ప్రకారం వెల్లడించాల్సినంత క్రిమినల్ కేసు ఆమెపై లేనప్పటికీ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఈ నిర్ణయం అన్యాయమైనదని చట్టపరంగా సందేహాస్పదమైనదని పేర్కొంది. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరింది.

►ALSO READ | మమతకు మరో బిగ్ షాక్.. రాజ్యసభకు TMC ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా

ఈ భేటీ అనంతరం అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల సంఘానికి సవివరంగా వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. నామినేషన్లో ఫారం 26కు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ తిరస్కరణ జరిగిందన్నారు. ఎన్నికల చట్టం ప్రకారం వెల్లడించాల్సినంత క్రిమినల్ కేసు మీనాక్షి నటరాజన్‎పై లేదన్నారు.
 
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ నిర్ణయం ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని దెబ్బతీసిందని, అసమాన పోటీ వాతావరణాన్ని సృష్టించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజే ఈ విషయం తెరపైకి రావడంతో.. సవరణలకు లేదా సమీక్షకు పరిమిత సమయం మాత్రమే మిగిలి ఉన్నందున ఈ విషయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని ఈసీని కోరామని తెలిపారు. ఈ నిర్ణయం తీవ్రమైన పొరపాటు అని.. ఎన్నికల సంఘం వెంటనే దీనిని సరిదిద్దాలని ఆయన కోరారు.

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్

రాజ్య సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్లో ఆమె వెల్లడించలేదని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.