పద్మారావునగర్, వెలుగు: గొడవను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడిపై బండరాయితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన జె.సుమన్, రాజు యాదవ్, శ్యాం, శ్రీను, ఉపేందర్ స్నేహితులు. వీరు ఈ నెల 8న రాత్రి 11.30 గంటలకు రాంనగర్‌లోని ఓ మండిలో బిర్యానీ తినడానికి వెళ్లారు. తింటున్న సమయంలో సుమన్, రాజు యాదవ్ మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. సుమన్‌పై కక్ష పెంచుకున్న రాజు యాదవ్మంగళవారం ఉదయం 7 గంటలకు వారాసిగూడలోని ఎల్.ఎన్. నగర్లో ఉండే అతని ఇంటికి వెళ్లాడు.
నిద్రిస్తున్న సుమన్ పై బండరాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు సుమన్ ను వెంటనే సికింద్రాబాద్‌గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు నిమ్స్ కు తీసుకెళ్లారు. నిందితుడు రాజు యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

