కొలువు పోయిందని టీఆర్ఎస్​ కండువాతో సూసైడ్ అటెంప్ట్

కొలువు పోయిందని టీఆర్ఎస్​ కండువాతో సూసైడ్ అటెంప్ట్
  • కొలువు పోయిందని టవరెక్కిన యువకుడు
  • టీఆర్ఎస్​ కండువాతో ఉరేసుకునేందుకు యత్నం
  • రక్షించిన పోలీసులు 

గజ్వేల్/సిద్దిపేట, వెలుగు: చదువుకు సరిపడా కొలువు దొరకలేదు.. అవుట్​సోర్సింగ్​లో దొరికిన చిన్నపాటి పని కూడా పోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో ఓ యువకుడు సెల్​టవర్​ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గజ్వేల్​ సీఐ ఆంజనేయులు, యువకుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా నర్సింలుపేట మండలం పాడ్యా తండాకు చెందిన తవుడియా శంకర్(35) బీఈడీ చేశాడు. వరంగల్​ కలెక్టరేట్​లో అవుట్​సోర్సింగ్​ అటెండర్​గా పని చేసేవాడు. శంకర్​కు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఉద్యోగంలో నుంచి శంకర్​ను తీసివేశారు. తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అదే సమయంలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వటంతో హాస్పిటల్​ఖర్చులతో ఆర్థికంగా కుంగిపోయాడు. మరోవైపు ఉద్యోగం కూడా లేకపోవటంతో తీవ్ర ఆందోళన చెందాడు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్​ సొంత నియోజకవర్గమైన గజ్వేల్​కు గురువారం వచ్చాడు. 

సెల్​టవర్​ఎక్కి నినాదాలు
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​రాజీవ్​ రహదారి సమీపంలోని మజీద్​పక్కనున్న బీఎస్ఎన్ఎల్​టవర్ పైకి గురువారం ఉదయం శంకర్​ఎక్కాడు. మెడలో టీఆర్ఎస్​కండువా వేసుకుని టవర్​పైనుంచి టీఆర్ఎస్.. కేసీఆర్​జిందాబాద్.. నాకు ఉద్యోగం కావాలి అంటూ నినాదాలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు గంటలు గడిచినా పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అతడితో మాట్లాడుతూనే మరోవైపు స్థానికంగా ఉన్న నలుగురు యువకులను పైకి ఎక్కించారు. ఇంతలో శంకర్​మెడలోని కండువాతో సెల్​టవర్​కు ఉరి వేసుకుని వేలాడసాగాడు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే యువకులు శంకర్​ను పట్టుకుని జాగ్రత్తగా కిందకు దించారు. అనంతరం పోలీసులు అతడిని గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆపై అదుపులోకి తీసుకున్నారు. శంకర్​టవర్​పైకి ఎక్కిన సమయంలో భార్యా పిల్లలు సైతం అక్కడే ఉండడం గమనార్హం. పెద్ద చదువులు చదివిన తన భర్తకు ఎలాగైనా ఉద్యోగం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని శంకర్​భార్య స్వాతి ప్రభుత్వాన్ని కోరింది.