భార్యను వెహికల్ తో ఢీకొట్టి చంపేందుకు యత్నం

భార్యను వెహికల్ తో ఢీకొట్టి చంపేందుకు యత్నం

భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిపల్లి, వెలుగు: తనపై, కుటుంబసభ్యులపై కేసు పెట్టిందనే కోపంతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..బోడుప్పల్ కి చెందిన బిల్డర్ శ్రీనివాస్ రెడ్డి(35)కి భార్య సంగీత, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. శ్రీనివాస రెడ్డి సుమారు రెండేళ్ల క్రితం నుంచి ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంగీత, శ్రీనివాస్ రెడ్డితో గొడవ పడింది. సంగీత గతేడాది బోడుప్పల్ లోని శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు మహిళా సంఘాల ఆధ్వర్యం లో తనకు న్యాయం జరగాలని ధర్నా చేసింది. శ్రీనివాస్ రెడ్డితో పాటు అతడి తల్లిదండ్రులపై ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసింది. తనపై, కుటుంబసభ్యులపై కేసులు పెట్టిన సంగీతపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. జూన్ 26న ఉదయం 7గంటలకు సంగీత బోడుప్పల్ లోని తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తోంటే నంబర్ ప్లేట్ లేని వెహికల్ తో శ్రీనివాస్ రెడ్డి ఆమెను ఢీకొట్టి పారిపోయాడు.ఈ ఘటనలో స్వల్పం గా గాయపడిన సంగీత..తన భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ మేడిపల్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది. శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.