బాలికను మోసగించి పెండ్లికి నిరాకరణ .. నిందితుడిపై కేసునమోదు 

బాలికను మోసగించి పెండ్లికి నిరాకరణ .. నిందితుడిపై కేసునమోదు 

చండ్రుగొండ,వెలుగు: ప్రేమిస్తున్నాని వెంట పడి.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడు, అతడిని ప్రోత్సహించిన వారిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..  భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కంపసాటి రవి రెండు నెలలుగా ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. బాలికది పేద కుటుంబం కావడంతో, చదువుకోవాలని ప్రేమను నిరాకరించింది. రవి చెల్లెలు, ఈమె ఇద్దరు స్నేహంగా ఉండేవారు.

రెండు నెలల కింద చెల్లెతో కలిసి బాలిక ఇంటికి వెళ్లాడు. చెల్లె పని ఉందని బయటికి వెళ్లగా, బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ నెల 3న బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెప్పడంతో కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక  ప్రెగ్నెంట్  అని డాక్టర్లు చెప్పడంతో, బాలికను నిలదీయగా విషయం చెప్పింది. ఈ క్రమంలో కుల పెద్దలతో కలిసి మైనార్టీ తీరగానే పెండ్లి చేద్దామని రవిని అడగగా, తమ కొడుకుకు ఎలాంటి సంబంధం లేదని రవి పేరెంట్స్​ చెప్పారు. దీంతో బాధితురాలి పేరెంట్స్​ రవితో పాటు అతడి తల్లిదండ్రులు, చెల్లెలిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.